
ఈ యేడు ఎండలు దంచి కొడుతున్నాయి. మనుషుల పాటు, పశు పక్షులు సైతం అధిక ఉష్ణోగ్రతల కారణంగా అల్లాడిపోతున్నాయి. ఇక మన గార్డెన్‌లోని మొక్కల పరిస్థితి కూడా అలాగే ఉంది. వేసవి కాలంలో మీ గార్డెన్‌లోని మొక్కలు పూలతో కళకళలాడాలంటే ఖరీదైన రసాయన ఎరువుల కంటే ఇంట్లోనే తయారు చేసుకునే ద్రవ ఎరువులు (Liquid Fertilizers) అద్భుతంగా పనిచేస్తాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలకు ఘనరూపంలో ఉండే ఎరువుల కంటే ద్రవరూప ఎరువులు అందించడం వల్ల అవి వేగంగా పోషకాలను అందుకుంటాయి. ఇందుకోసం సులభంగా తయారు చేసుకునే 3 రకాల ద్రవ ఎరువులు అద్భుతంగా పనిచేస్తాయి. అలాంటి ఎరువులేంటి..? వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..

అరటిపండు తొక్కల ఎరువు (Banana Peel Fertilizer): ఇందుకోసం మూడు లేదా నాలుగు అరటి తొక్కలను ఒక లీటరు నీటిలో వేసి రెండు రోజులు నాననివ్వాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి, మరో లీటరు నీటిని కలిపి మొక్కలకు పోయాలి. ఇందులో ఉండే పొటాషియం మొక్కలు మొగ్గలు వేయడానికి, పూలు పెద్దవిగా పూయడానికి సహాయపడుతుంది.

ఉల్లిపాయ పొట్టు నీరు (Onion Peel Liquid): ఉల్లిపాయ పొట్టును నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఆ నీరు ఎరుపు లేదా పసుపు రంగులోకి మారుతుంది. ఇది మొక్కలకు కావాల్సిన ఐరన్, కాల్షియం, మెగ్నీషియంను అందిస్తుంది. ఇది సహజమైన పెస్టిసైడ్‌లా కూడా పనిచేసి చీడపీడలను నివారిస్తుంది.

బియ్యం, పప్పు కడిగిన నీరు: మనం ప్రతిరోజూ బియ్యం లేదా పప్పులు కడిగినప్పుడు వచ్చే నీటిని పారబోయకుండా నిల్వ చేసి మొక్కలకు అందించాలి. ఈ నీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మట్టిలోని సూక్ష్మజీవులను వృద్ధి చేసి మొక్క ఎదుగుదలను వేగవంతం చేస్తాయి.

ఎలా ఉపయోగించాలి?: ఈ ద్రవ ఎరువులను ఎప్పుడూ ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే మొక్కలకు అందించాలి. గాఢత ఎక్కువగా ఉంటే తగినన్ని నీళ్లు కలిపి పల్చగా చేసి వాడటం మంచిది. నేరుగా ఆకులపై కాకుండా మొక్క మొదళ్లలో పోయాలి.

పర్యావరణానికి హాని కలిగించని ఈ సహజ ఎరువులు వాడటం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా, మీ ఇంటి తోట రంగురంగుల పూలతో నిండిపోతుంది. రసాయనాలకు స్వస్తి చెప్పి, ఈ వేసవిలో మీ మొక్కలకు ఇలాంటి లిక్విడ్ డైట్ ఇచ్చి చూడండి. మీ గార్డెన్ పూల వనంగా మార్చుకోండి!