
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకోవడం వెనుక ఉన్న ప్రధాన శాస్త్రీయ కారణం ఇదే. తమలపాకు నమలడం వల్ల లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. ఇది మనం తిన్న ఆహారాన్ని సులభంగా విచ్ఛిన్నం చేసి, జీర్ణక్రియ వేగవంతం అవ్వడానికి సహాయపడుతుంది. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.

తలనొప్పి నుండి ఉపశమనం: తమలపాకుకు అనాల్జేసిక్, శీతలీకరణ గుణాలు ఉన్నాయి. విపరీతమైన తలనొప్పిగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు తమలపాకులను నలిపి, ఆ రసాన్ని నుదుటిపై రాసుకున్నా లేదా తాజా తమలపాకులను నుదుటిపై పెట్టుకున్నా తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి: తమలపాకులను నమలడం వల్ల శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి, మానసిక ఒత్తిడి, ఆందోళన, అలసటను దూరం చేస్తుంది. డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో కూడా ఇది మేలు చేస్తుంది.

నోటి ఆరోగ్యం: తమలపాకులో యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. దీనివల్ల నోటి దుర్వాసన తగ్గడమే కాకుండా, పళ్ల రంగు మారడం, చిగుళ్ల వాపులు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

దగ్గు, జలుబు నివారణ: ఛాతీలో కఫం పేరుకుపోయినప్పుడు లేదా తీవ్రమైన దగ్గు ఉన్నప్పుడు, తమలపాకుపై కాస్త ఆవనూనె రాసి గోరువెచ్చగా వేడి చేసి ఛాతీపై ఉంచితే కఫం కరిగిపోతుంది. అలాగే తమలపాకు రసంలో కొద్దిగా తేనె కలుపుకొని తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు త్వరగా తగ్గుతాయి. తమలపాకును నేరుగా గానీ లేదా కొద్దిగా సున్నం, వక్కపొడి కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ పొగాకు, జర్దా వంటి హానికరమైన పదార్థాలను తమలపాకుతో కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరం.