- Telugu News Photo Gallery Tokyo olympics 2020-21 photos Tokyo olympics 2020 pv sindhu vs tai tzu ying fight in badminton semifinal today 31 07 2021
Tokyo Olympics 2020: సెమీ-ఫైనల్స్‌లో పీవీ సింధుకు కఠిన సవాలు.. బంగారానికి అడుగు దూరం.. రికార్డులు ఏమంటున్నాయంటే!
రియో ఒలింపిక్స్ 2016లో రజత పతక విజేత పీవీ సింధు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతోంది. ఆమె ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లలో వరుసగా విజయాలు సాధిస్తూ.. టోక్యో ఒలింక్స్‌లో దూసుకపోతోంది. కానీ, నేడు ఆమె సెమీఫైనల్‌లో కఠినమైన సవాలును ఎదుర్కోనుంది.
Updated on: Jul 31, 2021 | 6:58 AM

టోక్యో ఒలింపిక్స్ 2020లో భారతదేశానికి బంగారు పతకం తెచ్చే లిస్టులో ఉన్న వారిలో ఒకరు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. ఒలింపిక్స్‌లో తను ఆడుతూ వరుస విజయాలతో దూసుకపోతోంది. సింధు క్వార్టర్‌ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన అకనే యమగుచిని 21-13, 22-20 తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకున్న సింధు.. ప్రస్తుతం పతకానికి చాలా దగ్గరగా ఉంది. అయితే సెమీ ఫైనల్‌లో ఆమె ముందు కఠిన సవాలు ఉంది. ఇక్కడ సింధు చైనీస్ తైపీకి చెందిన తాయ్ జు-యింగ్‌తో పోటీపడుతుంది. ఈమెపై సింధు రికార్డు అంత మంచిగా లేకపోవడంతో.. నేడు అందరి ఆసక్తి పీవీ సింధు మ్యాచ్‌పై ఉంది.

ప్రపంచ నంబర్ వన్ మహిళా బ్యాడ్మింటన్ స్టార్ తాయ్ జు-యింగ్ రెండో క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమి నుంచి విజయాన్ని సాధించి సెమీ ఫైనల్ పోరులో నిలిచింది. థాయిలాండ్ లెజెండ్ రాట్చనోక్ ఇంటనాన్‌పై 14-21, 21-18, 21-18 విజయాన్ని నమోదు చేసిన తర్వాత తాయ్ జు-యింగ్ సెమీ ఫైనల్‌కు టికెట్ సొంతం చేసుకుంది.

బ్యాడ్మింటన్‌లో ఇద్దరు ఆటగాళ్లపై సింధు చాలా ఇబ్బందులు పడుతోంది. ఒకరు స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్ కాగా, చైనీస్ తైపీకి చెందిన తాయ్ జు-యింగ్. అయితే కరోలినా మారిన్ ఈ సారి ఒలింపిక్స్ బరిలో దిగలేదు. ఇక చైనీస్ తైపీకి చెందిన తాయ్ జు-యింగ్‌పై భారత లెజెండ్ ఎల్లప్పుడూ కఠిన పోరునే ఎదుర్కుంటోంది. గణాంకాలను ఓసారి పరిశీలిస్తే.. ఇద్దరూ ఇప్పటివరకు 18 సార్లు తలపడగా, ఇందులో తైజు 13 మ్యాచ్‌లు గెలిచింది. భారత్ బ్యాడ్మింటన్ స్టార్ సింధు కేవలం 5 విజయాలు మాత్రమే సాధించింది.

ఇద్దరు ఆటగాళ్లు నేడు ఒలింపిక్స్‌లో చాలా ముఖ్యమైన మ్యాచ్‌లో తలపడనున్నారు. అంతకుముందు 2016 రియోఒలింపిక్స్లో సింధు 21-13, 21-15తేడాతో తైజును సులభంగా ఓడించింది. అదే ఉత్సాహంతో నేడు సింధు నేడు బరిలోకి దిగనుంది.

తాయ్ జు-యింగ్ అనేక సందర్భాల్లో సింధును ఫైనల్స్‌లో ఓడించి ట్రోఫీలను సొంతం చేసుకుంటుంది. 2018 ఆసియా క్రీడల ఫైనల్‌లో తైపీ ప్లేయర్ సింధును 21-13, 21-16తో ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో చివరిసారి వీరిద్దరూ తలపడ్డారు. ఇక్కడ తైజు 19-21, 21-12, 21-17తేడాతో సింధును ఓడించింది.




