
రాత్రి త్వరగా పడుకుని, ఉదయం త్వరగా నిద్రలేవడం చాలా మంచి అలవాటు. కానీ చలి, నిద్రమత్తు వల్ల కొందరు మంచం దిగడానికి ఇష్టపడరు. అలారం మోగుతున్నప్పటికీ ఏదో ఒక నెపంతో మళ్ళీ నిద్రపోవాలని మనసు కోరుకుంటుంది. అందుకే కొంతమంది సాయంత్రం త్వరగా పడుకుంటారు. ఈ అలవాటు వల్ల ఉదయాన్నే మేల్కొనడానికి సహాయపడుతుంది. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో, రాత్రిపూట కొన్ని అలవాట్లను మార్చుకోవడం వల్ల ఉదయాన్నే నిద్రలేవడానికి సహాయపడతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

రాత్రిపూట నిద్రకు ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. అందుకే చమోమిలే టీ తాగవచ్చు. ఇది మీ మనసును ప్రశాంతపరచడమే కాకుండా బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. కానీ దీన్ని ఉదయం మాత్రమే తాగాలి. దీనితో పాటు, కాశ్మీరీ కహ్వా, జీరా, అజ్వైన్, రోజ్ టీతను కూడా తాగవచ్చు. ఈ చిన్న అలవాటు మీ నిద్ర దినచర్యను మారుస్తుంది.

పడుకునే ముందు ఏదైనా పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి. ఈ టెక్నిక్ మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. NIH అధ్యయనం ప్రకారం, పడుకునే ముందు బెడ్ మీద కూర్చుని పుస్తకం చదివే అలవాటు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలాని ఫోన్‌లో కథలు, నవలలు చదవకూడదు. బదులుగా, పుస్తకం పట్టుకుని చదవడం అలవాటు చేసుకోవాలి.

మనం సాధారణంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు అలారం ఆపివేసి నిద్రపోతాం. తరువాత, మేల్కొన్నప్పుడు దాని గురించి చింతిస్తాం. మీకూ ఈ అలవాటు ఉంటే, పడుకునేటప్పుడు అలారం అందకుండా బెడ్‌కు కొన్ని అడుగుల దూరంలో దీనిని ఉంచండి. దీంతో అలారం మోగిన వెంటనే దానిని ఆఫ్ చేయకుండా ఉంటారు. ఎందుకంటే దాన్ని ఆపివేయడానికి మీరు లేవాలి. కొంత దూరం నడవాలి. ఇలా చేయడం వల్ల గాఢ నిద్ర మత్తు వదిలిపోయి, మేల్కొనడానికి సహాయపడుతుంది.

నిద్రవేళకు ఆరు గంటల ముందు కెఫిన్ తీసుకోవడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా, పడుకునే ముందు మద్యం సేవించడం కూడా మంచిదికాదు. ఉదయం మగతను తగ్గించడానికి ఈ రెండు అలవాట్లు మానుకోవాలి. మధ్యాహ్నం వేళలో కెఫిన్ తీసుకోవడం పరిమితం చేయాలి. ఇది నిద్ర నాణ్యత మెరుగుపరుస్తుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనంలో తేలింది. ఇది సోమరితనాన్ని కూడా తగ్గించగలదు. అలాగే రాత్రి పడుకునే ముందు మొబైల్ వాడకాన్ని తగ్గించాలి.