
దేశంలో పెరుగున్న రోడ్డు ప్రమాదాల కారణంగా రోజుకు ఎంతో మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో చాలా వరకు సరైన సమయంలో వైద్యం అందకపోవడంతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఈ మరణాల రేటును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రహ వీర్ అనే సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా నిలువనుంది.

ఎవరైనా రోడ్డుపై వెళ్తున్న క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగినట్టు గమనిస్తే.. సమాజిక బాధ్యతతో వారిని హాస్పిటల్‌కు తరలించి.. వారికి ప్రాణాలు రక్షించే వారికి ప్రభుత్వం రహ వీర్ అనే పథకం కింద రూ.25 వేల బహుమతి, ప్రోత్సాహకం అందిస్తోంది. అయితే ఇప్పుడు ఈ పథకాన్ని తెలంగాణలోనే అమలు చేయాలని రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది.

రోడ్లపై ప్రమాదాన్ని గమనిస్తే భయపడకుండా ధైర్యంగా బాధితులను రక్షించి హాస్పిటల్‌కు తరలించే పౌరులను గౌరవిస్తామని తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసింది. అంతేకాదు వారికి రవాణా శాఖ తరపున రూ.25 వేల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం కూడా అందించనున్నట్టు పేర్కొంది. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించి, మరణాలను రేట్లను తగ్గించేందు పౌరులు ముందుకు రావాలని రవాణా శాఖ ఆదివారం ప్రకటించింది.

ఈ చొరవకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం కల్పించడానికి జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ప్రమాద బాధితులను రక్షించే వారికి గుర్తించేందుకు బాధితులను హాస్పిటల్‌కు తీసుకువచ్చిన వారి వివరాలను హాస్పిటల్ సిబ్బందితో పాటు పోలీసులు సేకరిస్తారు.

ఆ తర్వాత పోలీసులు కేసులను పరిశీలించి.. వాటని జిల్లా కమిటీలకు సిఫార్సు చేస్తారు. ఈ కమిటీలకు సంబంధిత జిల్లా కలెక్టర్ నేతృత్వం వహిస్తారు. వారు ఆమోదించిన పేర్లను రవాణా కమిషనర్‌కు ప్రోత్సాహకం విడుదల కోసం పంపుతారు. వారి పేర్లను పరిశీలించి ప్రమాదంలో ప్రజల ప్రాణాలు కాపాడిన పౌరులకు రవాణా శాఖ ప్రోత్సాహకం అందిస్తుంది.