
అధికారానికి, ఆత్మీయతకు మధ్య తేడా ఏంటో చూపించారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తాజాగా తన మధిర నియోజకవర్గ పర్యటనలో భాగంగా ముదిగొండ మండల కేంద్రానికి చేరుకున్న ఆయన, మార్గమధ్యలో 'నీల్ కమల్ టీ స్టాల్ వద్ద తన కాన్వాయ్‌ను ఆపి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అధికార హోదాను పక్కనపెట్టి ప్రజల్లో ఒకడిగా కలిసిపోయిన భట్టి విక్రమార్క, సామాన్యుడిలా స్టాల్ ముందున్న బల్లపై కూర్చున్నారు. చాయ్ తాగుతూ స్థానికులతో ముచ్చటించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రే నేరుగా తమ ముందుకు వచ్చి టీ తాగడం చూసి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు.

ఖమ్మం జిల్లా ముదిగొండ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారి నిర్మాణ పనులతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పనుల పరిశీలన అనంతరం ఆయన నేరుగా స్థానిక కూరగాయల మార్కెట్‌కు వెళ్లారు. మార్కెట్‌లో కలియదిరుగుతూ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అలాగే, ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ సరిగ్గా అందుతున్నాయా లేదా అని స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు.

మార్కెట్‌లోని ప్రజలు, వ్యాపారులతో మాట్లాడిన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు కచ్చితంగా అందుతాయని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రై సమాన్యుడిలా తమ దగ్గర కూర్చొని టీ తాగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.