
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి.. ఈ తరుణంలో సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు, వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురుగాలులతో పాటు.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40-60 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందందని పేర్కొన్నారు.

సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈదురుగాలులతో వర్షం పడే సమయంలో చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వంటి వాటి వద్ద నిలబడరాదన్నారు.

సోమవారం (24-08-2026) మేఘావృతమైన వాతావరణంతో పాటు పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, గంటకు 30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.