
ప్రకృతి ఆరాధన, సకల ప్రాణికోటి సంక్షేమం, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బంజారా (లంబాడా) సమాజపు అతిపెద్ద గిరిజన వేడుక ‘తీజ్ పండుగ’ తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరభారత దేశమంతటా వైభవంగా కొనసాగుతోంది. శ్రావణ మాసంలో ఆరంభమయ్యే ఈ సంబురాలు బంజారాల విశిష్ట సంప్రదాయాలకు, వారి జీవనశైలికి నిదర్శనం. ముఖ్యంగా కన్నెపిల్లల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే శాస్త్రీయ వ్యవసాయ పండుగగా ప్రసిద్ధి చెందిన తీజ్ మహోత్సవాన్ని ‘జాతీయ పండుగ’గా గుర్తించాలనే డిమాండ్ గిరిజన సంఘాల నుంచి బలంగా వినిపిస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో బంజారా భజరంగీ భేరీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిది రోజుల తీజ్ దీక్షోత్సవాలు సోమవారం నాడు అత్యంత ఘనంగా ముగిశాయి. కఠిన నిష్టతో దీక్షను విజయవంతంగా పూర్తి చేసిన 25 మంది బంజారా కన్యలకు సంఘం ప్రతినిధులు నూతన వస్త్రాలను బహుకరించి సత్కరించారు.

అనంతరం సాంప్రదాయ వస్త్రధారణ, అద్దాల లంగా-ఓణీలు, వెండి ఆభరణాలతో ముస్తాబైన గిరిజన యువతులు మంగళ వాయిద్యాలు, జానపద నృత్యాల నడుమ తలపై గోధుమ మొలకల బుట్టలను ఎత్తుకుని తీజ్ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా భజరంగీ భేరీ సంఘం జిల్లా నాయకుడు భూక్యా నాగరాజు మాట్లాడుతూ.. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ శాస్త్రీయ గిరిజన పండుగ ప్రాధాన్యతను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీజ్ ను అధికారిక జాతీయ పండుగగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

తీజ్ పండుగలో అత్యంత కీలకమైన ఘట్టం గోధుమ మొలకల పెంపకం. పండుగ ఆరంభ దినాన తండా పెద్దల సమక్షంలో కన్నెపిల్లలు వెదురు బుట్టలను సిద్ధం చేసి, స్థానిక వాగుల నుంచి తెచ్చిన ఒండ్రు మట్టి, సహజ ఎరువును అందులో నింపుతారు. ఆపై గోధుమ విత్తనాలు నాటి, తండాలోని చలువ పందిరి లేదా ప్రత్యేక వేదిక వద్ద భద్రపరుస్తారు. తొమ్మిది రోజుల పాటు నిష్టగా ఉంటూ నిత్యం నీరు పోసి ఆ బుట్టలను సంరక్షిస్తారు. ఆరాధ్య దైవాలైన సీత్లా భవాని, మేరమ్మ దేవతలకు పూజలు నిర్వహించి, తమకు మంచి గుణవంతుడైన భర్త దక్కాలని, కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని వేడుకుంటారు. తొమ్మిదో రోజు నాటికి బుట్టల్లో గోధుమ నారు ఏపుగా, పచ్చగా పెరిగి 'డూంగ్రో'గా మారుతుంది.

ఈ మొలకల ఎదుగుదల, పచ్చదనాన్ని పరిశీలించి ఆ ఏడాది వ్యవసాయ దిగుబడులు ఎలా ఉంటాయో పెద్దలు అంచనా వేస్తారు. అనంతరం సమీపంలోని జలాశయాలు లేదా వాగుల వద్దకు చేరుకుని పూజల అనంతరం బుట్టలను నిమజ్జనం చేస్తారు. ఆ గోధుమ మొలకలను 'తీజ్ ప్రసాదం'గా తమ అన్నదమ్ములు, పెద్దల తలపాగాలలో లేదా జేబులలో ఉంచి ఆడబిడ్డలు ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ వేడుకలో అన్నదమ్ములు తమ తోబుట్టువులకు కానుకలు సమర్పించి ప్రేమానురాగాలను చాటుకుంటారు