- Telugu News Photo Gallery Technology photos Isro heading new milestone by sending 100th rocket to space
ISRO: అంతరిక్షంలో సెంచరీ కొట్టేందుకు సిద్ధమైన ఇస్రో.. 29న నింగిలోకి GSLV-F15
ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అనేక విజయాలు సాధిస్తోంది. ఇప్పుడు ఇస్రో సరికొత్త రికార్డు బద్దలు కొట్టే దిశగా అడుగులు వేసింది. అంటే ఇస్రో తన 100వ రాకెట్‌ను ప్రయోగించే పనిలో పడింది. ఇది ఇస్రోకు కొత్త రికార్డుగా పరిగణిస్తోంది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైతే ..
Updated on: Jan 28, 2025 | 2:01 PM

గ్రౌండ్‌లో కాదు.. అంతరిక్షంలో సెంచురీకొట్టేందుకు సిద్ధమయింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్‌లో మరో కీలక ప్రయోగానికి సమయం ఆసన్నమయింది. శ్రీహరికోటలోని షార్ నుంచి తన వందో ప్రయోగమైన GSLV-F15 రాకెట్‌ను రేపు నింగిలోకి పంపనుంది ఇస్రో. దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజనిక్ రాకెట్ ద్వారా..NVS-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఈ తెల్లవారుజామున 2 గంటల 53 నిమిషాలకు ప్రారంభమయంది. 27 గంటలపాటు ఈ కౌంట్‌డౌన్ కొనసాగనుంది. రేపు ఉదయం 6 గంటల 23 నిమిషాలకు షార్‌లోని రెండో ల్యాంచ్‌ఫ్యాడ్ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

GSLV-F15 రాకెట్ జీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 17వది. దేశీయ క్రయోజెనిక్ స్టేజ్ ఉన్న 11వ రాకెట్. ఈ ప్రయోగం ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. దీని ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానున్నది. ఈ ఉపగ్రహం సెకండ్ జెనరేషన్ శాటిలైట్ కాగా.. ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని 29 మే 2023న ఇస్రో నింగిలోకి పంపింది. ఈ ఎన్‌వీఎస్-02 ఉపగ్రహం ఈ సిరీస్‌లో రెండో ఉపగ్రహం. ఇందులో ఎల్1, ఎల్5, ఎస్ బ్యాండ్‌లలో నావిగేషన్ పేలోడ్లతో పాటు సీబ్యాండ్ రేజింగ్ పేలోడ్స్ ఉంటాయి.

నావిక్ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. అమెరికాకు చెందిన జీపీఎస్‌కు ఇది ప్రత్యామ్నాయం. భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయం సేవలను అందించడం దీని ఉద్దేశం. కొత్త శాటిలైట్‌తో దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానున్నది. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని శాటిలైట్ సెంటర్‌లో రూపొందించగా.. ఇతర శాటిలైట్ సెంటర్లు సహకారం అందించాయి.

కీలక ప్రయోగం నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇస్రో చైర్మన్ వి.నారాయణన్. శ్రీహరికోట నుండి వందో ప్రయోగం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు వి.నారాయణన్. రేపు ఆర్బిట్‌లోని శాటిలైట్‌ను లాంచ్ చేస్తామని వివరించారు.

రాకెట్ ప్రయోగాలతో ఇస్రో ఇప్పటికే ఎన్నో ఘనతలను సాధించగా.. ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఇస్రో తన 100వ రాకెట్‌ను ప్రయోగించి విజయాన్ని తన ఖాతాలో వేసుకోనుంది. ఇస్రో ఈ రాకెట్‌కి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్15 అని పేరు పెట్టింది. ఈ రాకెట్ రెండు NVS-02 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది.




