Ajwain: ప్రతిరోజూ అర స్పూను వాము నమిలి తింటే చాలు.. శరీరంలో జరిగే ఈ మార్పులు ఊహించలేరు..!
ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉండే మసాలా దినుసుల్లో వాము కూడా ఒకటి.. దీనినే కొందరు ఓమా అని కూడా అంటారు. ఆయుర్వేదంలో వాముకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. వాములో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలకు, వ్యాధులకు వాము చక్కని ఔషధంగా పని చేస్తుందని చెబుతున్నారు. ఆయా లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Mar 24, 2025 | 5:41 PM

వాములో మన ఆరోగ్యానికి మేలు చేసే లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి రోజూ అర టీ స్పూన్ వాము నోట్లో వేసుకుని నమిలి తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఎసిడిటీ నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ శరీర జీవక్రియను ప్రోత్సహిస్తుంది. ఇది మీ శ్వాసకోశ సమస్యలను నయం చేస్తుంది. వామును నమలడం వల్ల నోట్లోని బ్యాక్టీరియా నశిస్తుంది. చిగుళ్ల వాపులు తగ్గుతాయి. దంతాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది.

రోజూ వామును తినడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. వాములో యాంటీ స్పాస్మోడిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల కడుపు నొప్పికి వాము దివ్యౌషధంగా పనిచేస్తుంది. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే కడుపు నొప్పి సైతం తగ్గిపోతుంది. అలాగే అజీర్ణం వల్ల వచ్చే నొప్పిని సైతం వాము తగ్గిస్తుంది.

వాములో ఉండే థైమోల్ అనే సమ్మేళనం ముక్కు రంధ్రాలను క్లియర్ చేస్తుంది. దీని వల్ల ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్, జలుబు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. వామును పొడి చేసి ఒక వస్త్రంలో చుట్టి వాసన పీలుస్తుంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వామును తినడం వల్ల పొట్టలో ఆమ్లాలు తటస్థీకరించబడతాయి. దీంతో గుండెల్లో మంట, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థలో ఉండే అసౌకర్యం తొలగిపోతుంది. గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే వామును తినడం వల్ల జీర్ణాశయంలో పలు ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. వాములో ఉండే థైమోల్ యాంటీమైక్రోబయల్ లక్షణాలు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

వాములో థైమోన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల వామును తింటే బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ఇది మీ శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది శరీరంలోని వ్యాధులను దూరం చేస్తుంది.





























