
పిల్లలు దేశ సంస్కృతిని గురించి తెలుసుకోవాలనుకుంటే పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు.. వారికి గొప్ప చరిత్రను కలిగి ఉన్న ప్రదేశాలను అన్వేషించేలా చేయడం దీనికి ఉత్తమ మార్గం. వేసవి సెలవుల్లో పిల్లలతో కలసి సందర్శించే కొన్ని వారసత్వ గ్రామాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ప్రాగ్‌పూర్, హిమాచల్ ప్రదేశ్ ఎక్కువ మంది వేసవిలో హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్ళడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులు హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రాగ్‌పూర్ గ్రామానికి వెళ్ళవచ్చు. భారతదేశపు మొదటి వారసత్వ గ్రామం ప్రాగ్‌పూర్ 16వ శతాబ్దంలో స్థాపించబడింది. అభివృద్ధి చెందినప్పటికీ.. ఇక్కడ పాత వాస్తు శిల్పకళా సంపద కనువిందు చేస్తుంది. కనుక ఈ గ్రామంలో పర్యటించడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.

గార్లి గ్రామం, హిమాచల్ ప్రదేశ్ గార్లీ హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక చిన్న వారసత్వ గ్రామం. ఇది ప్రాగ్‌పూర్ నుంచి చాలా దూరంలో ఉంది. ఇక్కడ నిర్మించిన భవనాల నిర్మాణం (ఒకప్పుడు ధనవంతుల నివాసాలు) ఎవరినైనా ఆకర్షిస్తాయి.

కిసామా గ్రామం, నాగాలాండ్ వారసత్వ గ్రామం గురించి చెప్పాలంటే నాగాలాండ్‌లోని కిసామా గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇది నాగాలాండ్ రాజధాని కోహిమా నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎవరైనా నాగ సంప్రదాయాలు, దాని గొప్ప వారసత్వం గురించి తెలుసుకోవాలనుకుంటే.. కుటుంబ సభ్యులతో కొండ సానువుల్లో ఉన్న ఈ గ్రామాన్ని సందర్శించవచ్చు.

రీక్ విలేజ్, మిజోరాం రెగ్యులర్ జీవితానికి దూరంగా ప్రకృతి మధ్య ప్రశాంతమైన జీవితాన్ని కొన్ని రోజులైనా గడపాలనుకుంటే మిజోరాంలో రీక్ గ్రామాన్ని సందర్శించవచ్చు. గ్రామీణ జీవితాన్ని దగ్గరగా తెలుసుకోవాలనుకుంటే ఎవరైనా హెరిటేజ్ విలేజ్ రీక్‌కి వెళ్ళవచ్చు. ఇక్కడ నిర్మించిన సాంప్రదాయ గుడిసెలు, సాధారణ జీవన విధానం ఎవరికైనా నచ్చుతుంది.

ఖాసి గ్రామం, మేఘాలయ మేఘాలయలోని ఖాసీ గ్రామాన్ని సందర్శిస్తే మంచి అనుభూతి కలుగుతుంది. ఇక్కడ అటవీ తెగల్లో ప్రధాన తెగల్లో ఒకటైన ఖాసీ తెగ సంప్రదాయ జీవనశైలిని తెలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది. అనేకాదు ఈ ప్రదేశం అందం ఎవరినైనా ఆకర్షిస్తుంది. ఖాసి గ్రామం దూరం షిల్లాంగ్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.