మండే ఎండలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వేసవిలో శరీరం నీటిని అధికంగా కోల్పోతోంది. కొంతమందికి చెమట విపరీతంగా పడుతుంది. ఇది చెడు వాసనను ఉత్పత్తి చేయడం వల్ల అసౌకర్యంగా అనిపిస్తుంది. వేసవిలో ఈ సమస్య చాలా మందిని వేధిస్తుంది. కొంతమందికి ఆహారం, జీవనశైలి, హార్మోన్ల మార్పులు వంటి వివిధ కారణాల వల్ల అధికంగా చెమట పడుతుంది. వేసవిలో అధిక చెమట కారణంగా చెమట దుర్వాసన రావడం ప్రారంభిస్తే ఈ కింది చిట్కాలు ఈ సమస్యకు సులభమైన పరిష్కారాన్ని సూచిస్తుంది.
శరీరం నుంచి చెమట దుర్వాసన రాకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి, మీ ఆహారంలో నిమ్మకాయ రసం, పెరుగును తప్పకుండా చేర్చుకోవాలి. ఇది చెమటలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది.
ఇంట్లోనే వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ నానబెట్టి, ఈ నీటిని చంకలకు అప్లై చేసి, పది నిమిషాలు అలాగే ఉంచి ఆపై తలస్నానం చేస్తే చెమట దుర్వాసన పోతుంది. రోజ్ వాటర్ కూడా వాడొచ్చు. స్నానానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి స్నానం చేయాలి. ఈ రోజ్ వాటర్ తేలికపాటి సువాసనను ఇస్తుంది. ఇది చెమట వాసనను కూడా తగ్గిస్తుంది.
అధికంగా చెమట పడుతుంటే, స్నానం చేసే ముందు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఆముదం నూనె కలిపి, ఈ మిశ్రంతో చంకలను 5 నుంచి 8 నిమిషాలు మసాజ్ చేయాలి. ఇది బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది. వేసవిలో ఈ చెమట వాసనను వదిలించుకోవచ్చు.
చెమట వల్ల వచ్చే దుర్వాసనను నివారించడానికి స్నానం నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కలపవచ్చు. ఇవి చెమట వల్ల కలిగే దుర్వాసనను తొలగించడమే కాకుండా, చర్మాన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వంకాయ ముక్కలను నానబెట్టిన నీటిలో చేతులు కడుక్కోవడం వల్ల కూడా చెమట తగ్గుతుంది. అంతేకాకుండా బంగాళాదుంపను కోసి చంకలపై పది నిమిషాల పాటు రుద్దడం వల్ల అధిక చెమట, శరీర దుర్వాసన నుంచి బయటపడవచ్చు.