Yadadri Temple: నరసింహుడు ఐదు రూపాల్లో దర్శనమిచ్చే క్షేత్రం.. స్వామివారు పాంచ నరసింహుడిగా ప్రసిద్ధి..
Yadadri Temple: యాదాద్రి పుణ్యక్షేత్రంలో సంభోద్భువుడు లక్ష్మీ నరసింహ స్వామి. ఇక్కడ ఐదు రూపాల్లో దర్శన మిస్తూ పంచ నారసింహ క్షేత్రంగా విరాజిల్లుతోంది. యాదాద్రి కొండపై పంచ అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉండడంతో యాదాద్రి పంచ నరసింహ క్షేత్రంగా విలసిల్లుతోంది.
Updated on: Mar 25, 2022 | 12:22 PM

జ్వాలా నరసింహుడు..నరసింహుడి దర్శనం కోరి రుష్యశృంగ మహర్షి కుమారుడు యాదర్షి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన స్వామి మొదట జ్వాలగా జ్యోతిర్మయ స్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. అగ్నిగోళాల్లా మండుతున్న నేత్రాలతో మహోగ్ర రూపంతో జ్వాలా నరసింహుడిగా కొలువుదీరాడు.

యోగ నరసింహుడు...మహోజ్వల జ్వాలా నరసింహుడిని దర్శించినా యాదర్షికి తృప్తి కలుగలేదు. స్వామి దర్శనం కోసం మళ్లీ తపస్సు ప్రారంభించాడు. యతి నిష్ఠకు మెచ్చిన నరకేసరి, యోగా నందుడిగా ప్రత్యక్షమయ్యాడు. దివ్యత్వం పొందాలంటే అష్టాంగ యోగ సాధనే మార్గమని సూచిస్తూ.. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే అష్టాంగ యోగ ప్రదర్శనగా యోగానంద నరసింహుడై వెలిశాడు.

గండభేరుండ నరసింహుడు....అప్పటికీ తనివి తీరని యాదర్షి మళ్లీ తపస్సుకు పూనుకున్నాడు. ఈసారి స్వామి పక్షిరూపంలో, రెక్కలు ధరించి, సింహముఖంతో గండ భేరుండ నరసింహుడిగా వెలిశాడు. గండభేరుండ నరసింహస్వామి క్షేత్రపాలకుడైన ఆంజనేయుడి సముఖంలో ఉండి భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఈ స్వామిని ఆరాధించిన వారికి భూత, ప్రేత, పిశాచ బాధలు తొలగిపోతాయని నమ్మకం.

లక్ష్మీ నరసింహుడు...గండభేరుండ రూపంలో దర్శనమిచ్చే సమయంలో స్వామి ప్రచండ వాయువులు సృష్టించాడట. ఆ పెను గాలులకు పెనువృక్షాలు కూలిపోతాయి. యాదర్షి మాత్రం స్వామి దర్శనం కోసం మళ్లీ తపస్సు చేయడం మొదలు పెట్టాడు. భక్తుడి తపోదీక్షకు మెచ్చిన నరసింహుడు శంఖ చక్రధారియై, శేషసింహాసనంపై అభయహస్తంతో ఆశీర్వదిస్తూ, లక్ష్మీ సమేతుడై యాదర్షికి దర్శనమిచ్చాడు. ‘ఇదే రూపంతో కొండపై నిలిచి, భక్తులను అనుగ్రహించమ’ని యాదర్షి కోరగా, స్వామి లక్ష్మీనరసింహుడిగా కొలువుదీరాడు.

ఉగ్ర నరహరి...వినువీధుల్లోంచి చూస్తే యాదాద్రి సింహా కృతిలో కనిపిస్తుంది. బ్రాహ్మీ ముహూర్త కాలంలో తదేక ధ్యానంతో స్వామిని సేవించే భక్తులకు.. యాదాద్రి నుంచి చిన్నచిన్న గర్జనలు వినబడుతూ ఉంటాయి. ఆ పర్వతమే సింహ గర్జనలు చేస్తుందని స్థల పురాణం. యాద పర్వతాన్నే ఉగ్ర నరసింహుడిగా భావిస్తారనీ యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు.




