
గణేశుడికి వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గజాననుడు, లంబోదరుడు, హేరంబ, బాలచంద్ర ఇలా అనేక నామాలున్నాయి. వాటిల్లో ఒకటి ఏకదంతుడు. పురాణాల్లో అతనికి ఏకదంతుడు అనే పేరు రావడం వెనుక కొన్ని ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. గణేశుడి పేరు ఏకదంతుడు అని పిలవడం వెనుక ఉన్న ప్రధాన కారణం అతని దంతాలలో ఒకటి విరిగిపోవడమే.

గణేశుడి తొండం దగ్గర ఉన్న ఒక దంతం.. పూర్తిగా ఉంటుంది.. ఒక వైపు దంతం విరిగి పోయి కనిపిస్తుంది. అంతేకాదు ఆ విరిగిన దంతం అతని చేతుల్లో ఉండడం అనేక చిత్రాల్లో లేదా విగ్రహాలలో చూసే ఉంటారు. అది ఒక ఆయుధంగా మారింది. అయితే ఇప్పుడు గణేశుడి దంతం ఎలా విరిగిందని ఆలోచిస్తున్నారా? దీనికి గల కారణం.. పురాణం కథ ఏమిటంటే..

గణేశునికి ఒక దంతం విరగడం గురించి అనేక పౌరాణిక కథలు ఉన్నాయి. వాటిలో మూడు కథలు ప్రధానమైనవి.. ఒక కథ ప్రకారం.. పరశురాముడు కోపంతో వినాయకుడి దంతం విరిగేలా చేశాడు. అయితే మరొక కథ ప్రకారం గణేశుడు తన దంతం విరిచి వేద వ్యాసుడి చెబుతున్న మహాభారతం రాయడానికి కలంగా ఉపయోగించాడు.

పరశురాముడు.. గణపతి దంతం ఎందుకు విరిచాదంటే: ఒక పురాణం ప్రకారం ఒకసారి పరశురాముడు పరమ శివుడిని కలవడానికి కైలాస పర్వతాన్ని చేరుకున్నాడు. అయితే తండ్రిని కలిసేందుకు వెళ్తున్న పరశురాముడిని గణపతి లోపలి వెళ్ళకుండా అడ్డుకున్నాడు. దీంతో పరశురాముడుకి కోపం వచ్చి.. అతను తన గొడ్డలితో గగణపతి ఒక దంతంపై కొట్టగా అది విరిగి పడిపోయింది.

వేద వ్యాసుడు.. మహాభారతం కథ: మరొక కథ ప్రకారం వేద వ్యాసుడు మహాభారతం చెబుతుండగా.. గణేశుడిని మహాభారత కథని గ్రంధస్తం చేస్తున్నాడు. అలా వేదవ్యాస మహర్షి చెబుతున్న సమయంలో గణేశుడు ఆపకుండా రాస్తానని షరతు పెట్టాడు. రాస్తున్నప్పు సమయంలో గణేశుడి కలం విరిగింది. అపుడు గణపతి తన దంతాలలో ఒకదాన్ని విరిచి.. దానిని ఒక కలంగా తయారుచేసుకుని మహాభారతం రాయడం కొనసాగించాడు.

గజముఖాసురుడి వథ కథ: కొన్ని పురాణ కథలలో ఒకసారి గణేశుడు గజముఖాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడు. అయితే ఆ రాక్షసుడిని ఏ ఆయుధంతోనూ చంపలేరని తెలుసుకున్న వినాయకుడు తన దంతం విరిచి ఆయుధంగా మలచి గజముఖాసురుడుని సంహరించడాని కూడా ప్రస్తావించబడింది.

హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ ప్రసిద్ధ కథల కారణంగా గణపతిని ఏకదంతాయ.. అని పిలుస్తారు. ఏకదంతం అంటే "ఒక పన్ను" అని అర్థం.