
వాస్తు అనేది చాలా శక్తివంతమైనది. అందుకే చాలా మంది వాస్తు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే వాస్తులో ప్రతి మూల, ప్రతి దిక్కుకు ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ఈశాన్యం మూల చాలా కీలకమైనదే కాకుండా పవిత్రమైనది. అందువలన ఈ దిశ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య బంధుత్వం, పురోగతి , సక్సెస్ అనేది ఈ దిశపైనే ఆధారపడి ఉంటుందంట. అందుకే దీని విషయంలో తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంట.

అయితే వాస్తు ప్రకారం ఆర్థికంగా కలిసి వచ్చి, ఇంటిలో డబ్బు నిలవాలంటే ఈశాన్యం దిశలో రాగి చెంబును పెట్టడం చాలా మంచిదంట. ఇది గురు వారం రోజు ఏర్పాటు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంట. అయితే దీనిని ఎలా ఎర్పాటు చేయాలి అంటే, ఈశాన్యం మూలను శుభ్రం చేసి, పీట పెట్టి దానిపై బియ్యం పిండితో ముగ్గువేసి, రాగి చెంబుకు పసుపు, కుంకుమ పెట్టి అందులో నీళ్లు, పసుపు ,కుంకుమ, అక్షింతలు, పూలు యాలకులు వేసి పెట్టాలి. దీనిని సోమవారం వరకు అలాగే ఉంచి, ఆ నీటిని వేరే మొక్కకు పోసి మళ్లీ గురువారం అలా చేయాలి. దీని వలన ఇంటిలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలిగిపోయి, చేతినిండా డబ్బు ఉంటుందంట.

అంతే కాకుండా ఈశాన్యం దిశలో దీపం వెలిగించడం కూడా చాలా మంచిదంట. ప్రతి గురు వారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈశాన్యంలో పీట వేసి, దానిపై ముగ్గు పెట్టి, పూలతో అలంకరించి, మట్టి ప్రమిదలో దీపం వెలిగించాలంట. దీని వలన ఆర్థికంగా కలిసి వస్తుందంట.

అదేవిధంగా, ఆవు దూడ బొమ్మను ఉంచడం చాలా మంచిదంట. గోమాతతో దూడ కలిసి ఉన్న బొమ్మను ఈశాన్యంలో ఉంచడం వలన ఇంటిలో ఎలాంటి సమస్యలు ఉండవు, అలాగే ఆర్థిక సమస్యలు తొలిగిపోయి ఇంటిలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది. కుటుంబ సభ్యుల్లో ప్రేమ పెరుగుతుంది. వారి కెరీర్ అభివృద్ధికి కూడా ఇది దోహద పడుతుందంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు