శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి పరమపద వైకుంఠనాథుని అలంకారంలో ఏడుతలల పెదశేషవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామివారి వాహనసేవకు ముందు కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు.
శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఆలయ ఆధికారులు పాల్గొన్నారు.
రాత్రి వాహనసేవ అనంతరం రంగనాయకుల మండపంలో నవరాత్రి కొలువు జరిగింది. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ధూపం, దీపం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం సమర్పించి శోడషోపచారాలు చేశారు.
వేదపండితులు దివ్యప్రబంధాన్ని పఠించి.. అర్చకులకు శఠారి, బహుమానం సమర్పిస్తారు. వాహనసేవల్లో అలసిపోయిన స్వామి, అమ్మవార్లకు ఉపశమనం కల్పించేందుకు ఈ కొలువు నిర్వహించారు.