
1896లో స్వీట్ షాప్ యజమాని దగ్దుసేత్, ప్లేగు వ్యాధితో కోల్పోయిన తన కొడుకు జ్ఞాపకార్థం నిర్మించిన ఆలయం దగదుషేత్ హల్వాయి గణపతి దేవాలయం. ఈ ఆలయం మహారాష్ట్రలో పూణే నగరంలో ఉంది. ఇక్కడ స్వామివారు ఎనిమిది కిలోల బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉంటాడు.

దగ్దుసేత్ తన ఆధ్యాత్మిక గురువు సలహా మేరకు ఆలయాన్ని నిర్మించాడని, గణపతి , దత్తా మహారాజ్ విగ్రహాలను ప్రతిష్టించాడని స్థానికులు చెబుతారు. ఆ విగ్రహాలను తన కుమారులవలె చూసుకున్నాడు. అందుకు ప్రతిఫలంగా గణేశుడు అతని కుటుంబానికి మాత్రమే కాకుండా, పూణే వాసులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చాడని స్థానికుల కథనం.

బాలగంగాధర తిలక్ ఈ గణపతి మందిరం ఆవరణలో గణేష్ చతుర్థిని ప్రజా పండుగగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాదు ఇక్కడే సామూహిక గణేష్ చతుర్థి వేడుకలు మొదలయ్యాయి. అలా మొదలైన గణపతి చతుర్థి వేడుకలు దేశ వ్యాప్తంగా మొదలయ్యి. ఏ వేడుకలు ఇప్పటికీకొనసాగుతున్నాయి.

ఈ హల్వాయీ గణపతిని ప్రతి సంవత్సరం లక్ష మంది యాత్రికులు సందర్శిస్తారు. గణేష చతుర్థి వేడుకలు పదిరోజుల పాటు నిర్వహిస్తారు. గణేశోత్సవ ఉత్సవాలను ప్రముఖులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు సహా భారీగా భక్తులు సందర్శిస్తారు.

ఇక్కడ పూజలను అందుకుంటున్న గణేష్ విగ్రహం 10 మిలియన్లకు బీమా చేయబడింది. ఈ ఆలయం అందమైన నిర్మాణం మరియు 100 సంవత్సరాలకు పైగా గొప్ప చరిత్రను కలిగి ఉంది. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఆలయ దీపాలంకరణ అద్భుతంగా ఉంటుంది.

ఇక్కడ గణపతి కి భక్తులు బంగారం, డబ్బును కానుకగా సమర్పిస్తారు. ఇలా సమర్పిస్తే.. తాము భగవంతుడి అనుగ్రహంతో మరింత ధనవంతులు అవుతామని భక్తుల విశ్వాసం.