
మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలోకి శనీశ్వరుడు ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి శని ప్రారంభం అయింది. దీని వల్ల ఊహించని కష్టనష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ఉద్యోగం పోవడం, ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం, పని భారం, పని ఒత్తిడి పెరగడం, అధికారుల ఆగ్రహానికి గురి కావడం, ఖర్చులు పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందకపోవచ్చు. ఈ రాశివారు శని త్రయోదశిని గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవడం మంచిది.

సింహం: ఈ రాశికి శని అష్టమ శని దోషం ప్రారంభమైంది. అష్టమ శని అష్ట కష్టాలనిస్తాడని ప్రతీతి. ఎంత కష్టపడ్డా ఆదాయం పెరిగే అవకాశం ఉండదు. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రతి పనీ ఆలస్యం కావడంతో పాటు తిప్పట ఎక్కువగా ఉంటుంది. వృక్తిగత సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలించవు. ఈ రాశివారు శని త్రయోదశి నాడు శనికి దీపం వెలిగించడం మంచిది.

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ప్రతి పనికీ ఒకటికి రెండుసార్లు తిరగాల్సి వస్తుంది. పని భారం బాగా పెరుగుతుంది. ఆదాయం ఒక పట్టాన పెరిగే అవకాశం ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరగడం తప్ప ఉపయోగం ఉండదు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. పెళ్లి సంబంధాలు చివరి దాకా వచ్చి వెనక్కు వెళ్లడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తడానికి అవకాశం ఉంది. శని త్రయోదశి రోజున వీరు శనికి తైలాభిషేకం చేయడం మంచిది.

ధనుస్సు: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో శని ప్రవేశం వల్ల అర్ధాష్టమ శని దోషం ప్రారంభమయింది. దీని వల్ల సుఖ సంతోషాలు తగ్గిపోతాయి. మనశ్శాంతి లోపిస్తుంది. కుటుంబంలో బరువు బాధ్యతలు పెరగడంతో పాటు, కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ కావడం జరుగుతుంది. ఆస్తిపాస్తుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గృహ ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి. శని త్రయోదశి రోజున వీరు శనితో పాటు శివుడిని కూడా పూజించడం మంచిది.

కుంభం: శని మీన రాశి ప్రవేశంతో ఈ రాశివారికి మూడవ దశ ఏలిన్నాటి శని ప్రారంభమైంది. శని ధన స్థానంలో ప్రవేశించడంతో ఆర్థిక సమస్యలు మొదలైనట్టేనని భావించాలి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందకపోవచ్చు. ధనాదాయం బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది కలిగిస్తాయి. ఎన్నడూ లేని విధంగా కుటుంబ సమస్యలు తలెత్తుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఈ రాశివారు శని త్రయోదశి రోజున శనికి ప్రదక్షిణలు చేయడం మంచిది.

మీనం: ఈ రాశిలోకి శని ప్రవేశంతో ఈ రాశివారికి రెండవ దశ ఏలిన్నాటి శని మొదలైంది. ఉద్యోగంలో ప్రాభవం తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు తల్తెత్తుతాయి. కొద్దిగా అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండకపోవచ్చు. ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ప్రతి పనికీ బాగా శ్రమపడాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోతారు. ఈ రాశివారు శని త్రయోదశిని సద్వినియోగం చేసుకోవడం మంచిది.