
మేషం: ఈ రాశివారికి ఉద్యోగంలో జూనియర్ల నుంచే కాక, సీనియర్ల నుంచి కూడా అసూయా ద్వేషాలు ఎదురవుతుంటాయి. వీరు ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా విరోధులు, ప్రత్యర్థులు కాస్తంత ఎక్కువగానే ఉంటారు. వృత్తి, ఉద్యోగాల్లో వీరు పక్కలో బల్లెం మాదిరిగా వ్యవహరిస్తుంటారు. రాశ్యధిపతి కుజుడు, గురువు వీరికి అనుకూలంగా ఉన్నందువల్ల విరోధులు లేదా పోటీదార్లు వెనుకడుగు వేసే అవకాశం ఉంటుంది. ఏలిన్నాటి శని వల్ల రహస్య శత్రువులకు అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశివారిలోని చొరవ, తెగువ, పోరాటస్ఫూర్తి తదితర లక్షణాల కారణంగా వీరికి శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్లు కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా సహచరులు, బంధువులే ఎక్కువగా విరోధులుగా మారుతుంటారు. ఈ రాశిలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి ప్రస్తుతం బలం ఎక్కువగా ఉంటుంది. విరోధుల మీద వీరిదే పైచేయిగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా ఈ ఏడాది ఈ వీరిని శత్రువులు ఏమాత్రం దెబ్బతీసే అవకాశం ఉండకపోవచ్చు.

సింహం: ఈ రాశివారికి బాగా తక్కువ సంఖ్యలో ఎక్కువ కాలం శత్రువులు కొనసాగే అవకాశం ఉంటుంది. శత్రువులు నమ్మక ద్రోహాలకు, వెన్నుపోట్లకు, దుష్ర్పచారాలకు పాల్పడడం జరుగుతుంది. బంధువులు, కింది ఉద్యోగుల నుంచి సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఈ రాశివారికి సాధారణంగా తన కింది ఉద్యోగుల నుంచి సహకారం లభించదు. గురువు లాభ స్థానంలో ఉండడం, కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల ఈ ఏడాది శత్రువుల మీద వీరు పైచేయి సాధించే అవకాశం ఉంది.

తుల: ఈ రాశివారికి ఆరవ స్థానంలో ప్రస్తుతం శని సంచారం వల్ల ఎటువంటి శత్రువైనా వెనుకడుగు వేసే అవకాశం ఉంది. సన్నిహితుల ముసుగులో విరోధులు చుట్టుపక్కలే ఉండడం జరుగుతుంది. వీరిని చూసి అసూయపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల్లో కొందరు వీరికి అపకారం తలపెడతారు. వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు, అవరోధాలు సృష్టించే వారు ఉంటారు. భాగ్య స్థానంలో ఉన్న గురువు వల్ల కూడా వీరికి శత్రువుల మీద విజయాలు లభిస్తాయి.

వృశ్చికం: ఈ రాశివారికి రహస్య శత్రువుల ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నమ్మక ద్రోహాలకు, చెడు ప్రచారాలకు పాల్పడుతుంటారు. విరోధులు బంధువులు, సహచరుల రూపంలో ఉండే అవకాశం ఉంది. ఈ రాశివారు వీరి విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. ఈ రాశికి అధిపతి అయిన కుజుడు, గురువు ఈ ఏడాది చివరి వరకూ అనుకూల స్థానాలలో సంచరిస్తున్నందు వల్ల వీరిని విరోధులు దెబ్బతీసే అవకాశం ఉండకపోవచ్చు. వీరికి తప్పకుండా శత్రు జయం ఉంటుంది.

ధనుస్సు: ఈ రాశివారికి సహచరుల నుంచే ఎక్కువగా సమస్యలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ శత్రువులు, పోటీదార్లు కుట్రలు, కుతంత్రాలు చేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సహచరుల నుంచి పోటీ ఎక్కువగా ఉంటుంది. అసూయపడే సహోద్యోగుల వల్ల వీరు అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది కానీ, ఈ ఏడాదంతా తృతీయంలో రాహు సంచారం వల్ల కుజ, రవుల అనుకూలత వల్ల ఈ రాశివారిదే అన్నిటా పైచేయి అవుతుంది.