
మేషం: రాశ్యధిపతి కుజుడు నవమ, దశమ స్థానాల్లో సంచారం చేయడంతో పాటు, మే నుంచి గురువు చతుర్థ స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి కొత్త సంవత్సరం ప్రథమార్థంలో తప్ప కుండా గృహ యోగం కలిగే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యలు, వివాదాలు క్రమంగా పరిష్కారమయ్యే అవకాశం కూడా ఉంది. ఉద్యోగపరంగా గానీ, ప్రభుత్వపరంగా గానీ భూ లాభం కలిగే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి రావడానికి కూడా అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశికి సప్తమ స్థానంలో భూ కారకుడు కుజుడు ఉచ్ఛపట్టడం, కర్కాటక రాశిలోనే గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి తప్పకుండా గృహ, వాహన యోగాలు పట్టడం జరుగుతుంది. కొత్త ఏడాది ప్రథమార్థంలోనే స్థలం గానీ, ఫ్లాట్ గానీ కొనే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి సంక్రమిస్తుంది. ఇతరుల కబ్జాలో ఉన్న స్థలం లేదా పొలం తప్పకుండా విడుదల అవుతుంది. పిత్రార్జితం కూడా లభిస్తుంది.

తుల: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజుడు ఉచ్ఛ పట్టడం వల్ల ఈ రాశివారికి ఏడాది ప్రథమార్థంలోనే తప్పకుండా గృహ యోగం కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉన్నందువల్ల స్థలాలు, పొలాలు కొనడం కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అపర కుబేరులయ్యే అవకాశం ఉంది. భూముల క్రయవిక్రయాల్లో అంచనాలకు మించి లాభాలు పొందుతారు. బంధువులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. తల్లి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది.

వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు బాగా అనుకూల స్థానాల్లో సంచారం చేయడంతో పాటు మే తర్వాత నుంచి గృహ కారకుడు గురువు ఉచ్ఛ స్థితికి వస్తున్నందువల్ల ప్రథమార్థంలో ఆస్తిపాస్తులు కలిసి రావడం, ద్వితీయార్థంలో గృహ యోగం కలగడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. కొత్తగా ఆస్తులు కొనే అవకాశం కూడా ఉంది. ఇంతవరకూ ఆస్తి లేని వారికి కొత్త ఏడాది తప్పకుండా దశ తిరగడం జరుగుతుంది.

మకరం: ఈ రాశికి చతుర్థ స్థానాధిపతి అయిన కుజుడు ఈ రాశిలో ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి తప్ప కుండా ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. అనేక మార్గాలో ఆదాయం పెరిగే అవకాశం ఉండడం, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల కలిసి రావడం వల్ల వీరు ఆస్తిపాస్తులను సమకూర్చుకునే అవకాశం ఉంది. ఏడాది ప్రథమార్థంలోనే గృహ యోగం కలుగుతుంది. మేలో గురు గ్రహం సప్తమ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఆస్తిపాస్తులు వృద్ధి చెందడం, వాటి విలువ బాగా పెరగడం వంటివి జరుగుతాయి.

మీనం: ఈ రాశికి కుజుడు లాభ స్థానంలో ప్రవేశించడం వల్ల ఫిబ్రవరి లోగా ఈ రాశివారికి తప్పకుండా ఆస్తి లాభం కలుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందే అవకాశం ఉంది. స్థలాలు, పొలాల మీద పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. మే తర్వాత వీరికి గృహ యోగం కలుగుతుంది. గురు దృష్టితో ఏలిన్నాటి ప్రభావం తగ్గిపోవడం వల్ల ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందడం, వీరు స్థలాలను కొనుగోలు చేయడం జరుగుతుంది.