
కాశీ.. ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరం. శివయ్య కొలువైన ఆధ్యాత్మిక నగరం శివుని త్రిశూలం మీద ఉందని చెబుతారు. కాశీలో జరుపుకునే హోలీ వేడుకల కోసం నగరం సిద్దం అవుతుంది. ఇక్కడ మసాన్ హోలీ ఆడతారు. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ముగిసిన అనంతరం నాగ సాధువులు మసాన్ హోలీ ఆడటానికి కాశికి చేరుకున్నారు. ఈ హోలీ చాలా ప్రత్యేకమైనది. ఈ హోలీ మరణం, మోక్షం, శివుని పట్ల భక్తితో ముడిపడి ఉంది.

ఈ హోలీని ముఖ్యంగా కాశీలోని మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ వద్ద ఆడతారు. ఈ రెండూ దహన సంస్కార స్థలాలు. సాధువులు, శివ భక్తులు శ్మశాన వాటికలలో మాసాన్ హోలీ ఆడటానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ హోలీ వేడుకలను చితి బూడిదతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం కాశీలో మసాన్ హోలీ ఎప్పుడు ఆడతారు? మాసాన్‌లో హోలీ ఆడే సంప్రదాయం ఎలా మొదలైందంటే..

మసాన్ హోలీ ఎప్పుడంటే.. వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రంగుల హోలీ మార్చి 14, 2025న జరుపుకోనున్నారు. అయితే కాశీలో మసాన్ హోలీని రంగభరి ఏకాదశి తర్వాత రోజు ఆడతారు. ఈ సంవత్సరం రంగభరి ఏకాదశి మార్చి 10న వచ్చింది. దీంతో ఈ సంవత్సరం మసాన్ హోలీ మార్చి 11న జరుపుకోనున్నారు.

మసాన్‌లో హోలీ ఆడే సంప్రదాయం.. శివుడికి , శ్మశానవాటికకు సంబంధించినదని చెబుతారు. హిందూ మత గ్రంథాలలో శివుడు లయకారుడు .. మోక్షాన్ని ఇచ్చే దైవంగా చెప్పబడింది. ఆ శ్మశానవాటిక నివాసి శివుడు. శివుడికి శ్మశానవాటిక అంటే చాలా ఇష్టమని నమ్మకం.

శివుడు శ్మశానవాటికలో నృత్యం చేస్తూ తన అనుచరులతో హోలీ ఆడతాడు. రంగభరి ఏకాదశి రోజున శివుడు తన అనుచరులతో గులాల్‌తో హోలీ ఆడాడు. అయితే రాక్షసులు, యక్షులు, గంధర్వులు, ఆత్మల కోరిక మేరకు హోలీని రంగభరి ఏకాదశి తర్వాత రోజు మాసాన్ హోలీ ఆడతారు.

మసాన్ హోలీ అనేది మరణ పండుగను జరుపుకోవడంతో సమానంగా భావిస్తారు. మనిషి తన భయాన్ని అదుపులో ఉంచుకుని మరణ భయాన్ని విడిచిపెట్టినప్పుడు జీవించడంలో ఆనందాన్ని పొందుతారు. అహం, దురాశ వంటి దుర్గుణాలు ఉన్నప్పటికీ వారి జీవితం బూడిదగా మారి ముగుస్తుందని మసాన్ హోలీ బోధిస్తుంది. గుప్పెడు బూడిద మాత్రమే చివరికి మనిషికి మిగిలేది అనే పరమ సత్యాన్ని బోధిస్తుంది.

మణికర్ణికా ఘాట్: మోక్ష ద్వారం.. కాశీలోని మణికర్ణికా ఘాట్‌ను మోక్షానికి ద్వారం అంటారు. ఇక్కడ శివుడి మోక్షం ఇస్తాడని నమ్ముతారు. రంగభరి ఏకాదశి మరుసటి రోజు సాధువులు, ఋషులు చితి బూడిదతో హోలీ ఆడతారు. శివాలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. బూడిద, గులాల్ చల్లుకుంటూ శివుడిని కీర్తిస్తూ స్తోత్రాలు పాడతారు. ఆనందంతో తాండవ నృత్యం చేస్తారు.