
మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడితో పాటు, ఈ రాశికి భాగ్యాధిపతి అయిన గురువు కూడా మరో ఆరు నెలల పాటు బాగా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు ఇబ్బడిముబ్బడిగా లాభాలు గడించే అవకాశం ఉంది. వీరి సృజనాత్మక శక్తి, మార్కెటింగ్ నైపుణ్యాలు బాగా వృద్ధి చెందడం జరుగుతుంది. భూముల క్రయ విక్రయాల్లో రియల్ ఎస్టేట్ వారు, బిల్డర్లతో పాటు ఇతరులు కూడా ఈ నెల 17 నుంచి బాగా లబ్ధి పొందడం జరుగుతుంది.

వృషభం: ఈ రాశికి కుజుడు భాగ్య స్థానంలో, గురువు ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల, రాశ్యధిపతి కూడా భాగ్యస్థానంలో ఉన్నందువల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పట్టిందల్లా బంగారం అవుతుంది. అవసరానికి ఆస్తులు అమ్మదలచుకున్నవారు, కొనదలచుకున్నవారు కూడా అంచనాలకుమించి లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ నెల 17 నుంచి ఈ రాశివారికి ఆస్తుల క్రయ విక్రయాల్లో దశ తిరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారు, బిల్డర్లు సరికొత్త వెంచర్లతో పురోగతి చెందే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశివారికి ఈ ఏడాదంతా కుజ, గురువులు అనుకూలంగా ఉండబోతున్నందువల్ల రియల్ ఎస్టేట్ రంగంలో వీరు అపర కుబేరులుగా ఎదిగే అవకాశం ఉంది. భూములు, ఇళ్లు కొనుగోళ్లు, అమ్మకాలను ఎవరు చేపట్టినా బాగా లబ్ధి పొందడం, సంపన్నులు కావడం జరుగుతుంది. ఈ రాశి వారికి జూన్ తర్వాత నుంచి ఈ రంగంలో మరింతగా ఎక్కువగా లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఈ రాశివారికి పొలాలు, స్థలాల వ్యాపారం బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ దశ తిరుగుతుంది.

సింహం: ఈ రాశి సహజసిద్ధమైన రియల్ ఎస్టేట్ రాశి అయినందువల్ల ఈ రాశివారికి ఈ ఏడాది ఈ రంగంలో గతంలో ఎన్నడూ లేనంతగా కలిసి వచ్చే అవకాశం ఉంది. పొలాలు, స్థలాలు, ఇళ్లు అమ్మకాలు, కొనుగోళ్లు బాగా లాభసాటిగా సాగిపోతాయి. వీరి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ఈ ఏడాది జూన్ తర్వాత వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతుంది. భూముల క్రయ విక్రయాలు అంచనాలకు మించి లాభిస్తాయి.

వృశ్చికం: రాశినాథుడు కుజుడు ఈ నెల 17 నుంచి ఉచ్ఛపడుతున్నందువల్ల భూములకు సంబంధించిన ఎటువంటి వ్యాపారమైనా ఈ రాశివారికి బాగా కలిసి వస్తుంది. జూన్ తర్వాత గురువు కూడా భాగ్య స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల వీరు ఈ రంగంలో అపర కుబేరులు కావడానికి అవకాశం ఉంది. ఇతరులు కూడా భూములు, ఇళ్లు, స్థలాల క్రయ విక్రయాల్లో ఇబ్బడిముబ్బడిగా లాభాలు పొందుతారు. వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు తమ నైపుణ్యాలను పెంచుకోవడం జరుగుతుంది.

మకరం: ఈ రాశి నుంచి ఈ రాశికి నాలుగవ స్థానం వరకు కుజుడు సంచారం చేయడం వల్ల ఈ రాశికి చెందిన రియల్ ఎస్టేట్ వారు, బిల్డర్లు ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. జూన్ నుంచి గురువు కూడా అనుకూలం అవుతున్నందువల్ల వీరికి ఈ ఏడాదంతా ఈ రంగంలో లాభాలు అందుతూనే ఉంటాయి. వీరి నైపుణ్యాలు బాగా వృద్ధి చెందుతాయి. వీరి పెట్టుబడులు అత్యధికంగా లాభాలనిస్తాయి. ఇతరులు కూడా భూముల క్రయ విక్రయాల్లో అంచనాలకు మించిన లాభాలు పొందుతారు.