
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కంభం చెరువు దగ్గర 400 ఏళ్ళుగా నిర్వహించే ప్రత్యేకమైన పండుగ 'తేరాతేజి' అంటే గరిక తొక్కుడు పండుగ. దీనిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ముస్లింలు, ఇతర మతాలకు చెందిన ప్రజలు కుటుంబాలతో కలిసి వచ్చి ఘనంగా జరుపుకుంటారు.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ చెరువుగా పేరుగాంచిన మార్కాపురం జిల్లా కంభం చెరువు కట్టపై తేరాతేజీ, గరిక తొక్కుడు పండగ వేడుకలు జరిగాయి. ప్రతి సంవత్సరం కంభం చెరువు కట్టపై నిర్వహించే ఈ వేడుకలకు 4 జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తారు.

చెరువుని సందర్శించడమే కాకుండా చెరువు కట్టపై ఉన్న దీనాషా వలి దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. జూలై నెలలో నెల పొడుపు కనిపించిన 13వ రోజు ముస్లింలు ఈ పండగను జరుపుకుంటారు. తేరాతేజీ నెల చేదు నెలగా ముస్లింలు చెబుతుంటారు.

కొత్తగా పెళ్లయిన నూతన వధూవరులు నెల పొడుపు కనిపించినప్పటి నుంచి ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా 13వ రోజున కంభం చెరువులోని గంగమ్మకు తమ వివాహ సమయంలో మార్చుకున్న దండలను సమర్పిస్తారు. తర్వాత దర్గాలో పూజలు నిర్వహిస్తారు.

అంతే కాకుండా పెళ్లి కానీ యువతులను ఇక్కడికి తీసుకువచ్చి గరిక తొక్కించడం వల్ల వారికి త్వరగా వివాహమవుతుందని అందుకే ఈ వేడుకలను గరిక తొక్కుడు పండుగ కూడా అంటారని స్థానికులు చెబుతుంటారు. భారీగా తరలివస్తున్న భక్తుల కొరకు అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.