- Telugu News Photo Gallery Spiritual photos Kailash Mansarovar Yatra: know Mystery and Importance of Kailash Mansarovar Dharma
Kailash Mansarovar Yatra: శివ శివా అంటూ సాగుతున్న మానస సరోవర యాత్ర.. ఈ సరస్సు ప్రాముఖ్యత ఏమిటంటే..
కైలాస మానస సరోవర యాత్ర దాదాపు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రారంభమైంది. కైలాస మానస సరోవర యాత్ర హిందూ మతంతో పాటు బౌద్ధమతం, జైన మతానికి కూడా చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికంగా పవిత్రమైన కైలాస మానస సరోవరానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.
Updated on: Jul 01, 2025 | 8:05 AM

హిందూ మతంలో కైలాస మానస సరోవరం శివుని నివాసంగా పరిగణించబడుతుంది. కనుక ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ కైలాస మానస సరోవర ఆధ్యాత్మిక యాత్ర జూన్ 30 నుంచి ప్రారంభమైంది. ఇది రాబోయే 2 నెలలు అంటే ఆగస్టు వరకు కొనసాగుతుంది. కైలాస మానస సరోవర పర్వతానికి సంబంధించిన అనేక గొప్ప కథలు ఉన్నాయి.

హిమాలయ పర్వతాల మధ్య ఉన్న కైలాస పర్వతంపై త్రిమూర్తులలో లయకారుడైన శివుడుపార్వతితో కలిసి నివసిస్తున్నాడని చెబుతారు. అందుకనే కైలాస మానస సరోవరయాత్ర చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇక్కడికి వీళ్ళే భక్తులు చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందని స్వర్గాన్ని పొందుతారని మత విశ్వాసం.

స్కంద పురాణం ప్రకారం ఎవరైనా కైలాసంలోని శివుడిని పూజిస్తే.. ఏడు జన్మలలో చేసిన పాపాలు వెంటనే తొలగిపోతాయి. మరో మాటలో చెప్పాలంటే కైలాస మానస సరోవరాన్ని సందర్శించడం ద్వారా గత జన్మల పాపాలన్నీ నశించి మోక్షాన్ని పొందుతాడు.

శివలింగ ఆకారంలో ఉన్న కైలాస పర్వతాన్ని ప్రకృతి స్వయంగా సృష్టించిన శివుని రూపంగా భావిస్తారు. కైలాస మానస సరోవర యాత్రను మోక్షానికి మార్గంగా భావిస్తారు. ఈ ప్రయాణంలో మానస సరోవర అనే సరస్సు కూడా ఉంది. ఇది బ్రహ్మ దేవునికి సంబంధించినదని నమ్ముతారు.

ఈ సరస్సు సృష్టికర్త బ్రహ్మ దేవుడి మనస్సు నుంచి పుట్టిందని ఒక మత విశ్వాసం ఉంది, అందుకే దీనిని మానస సరోవరం అని పిలుస్తారు. ఈ సరస్సులోని నీరు అత్యంత పవిత్రం. కైలాస మానస సరోవర తీర్థయాత్ర, సరస్సులో చేసే స్నానం, ఇక్కడ చేసే తపస్సుకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనిలోని నీరు అమృతం లాంటిదని, దీనిలో స్నానం చేయడం అత్యంత పవిత్రం అని.. నీరు త్రాగడం ద్వారా తెలిసి తెలియక చేసిన సకల పాపాలు నశిస్తాయని చెబుతారు.

శివుని అనుగ్రహంతో ఈ సరస్సు నీటి మట్టం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని చెబుతారు. కఠినమైన శీతాకాలంలో కూడా ఈ మానస సరోవరంలో మంచు గడ్డకట్టదు. అదే సమయంలో మానస సరోవరానికి సమీపంలోనే రాక్షసి తల అనే మరో సరస్సు ఉంది. దీనిలోని నీరు ఘనీభవిస్తుంది. అదే దేవుడి మహిమ అని అంటున్నారు.




