ఈ పూరి జగన్నాథుడి రథ యాత్ర 12 రోజులు పాటు జరిగే ఉత్సవం .ఈ యాత్రకి రెండు నెలలముందు నించే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియనాడు పనులు మొదలవుతాయి. పూరీ మహారాజు పూజారుల్ని పిలిపించి, కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. సామంతరాజు దసపల్లా అప్పటికే అందుకు అవసరమైన వృక్షాల్ని గుర్తిస్తాడు. వాటికి వేదపండితులు శాంతి నిర్వహిస్తారు. అనంతరం ఆ చెట్లను జాగ్రత్తగా నరికి 1,072 కాండాలను పూరీకి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13 వేల ఘనపుటడుగుల కలప అవసరం. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయనాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. ముందు వృక్ష కాండాల్ని 2,188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు.