హోలీ పేరు వినగానే రంగురంగుల గులాల్, సరదాగా ఆటలు, వివిధ రకాల వంటలు, సరదాగా నిండిన వాతావరణం మన కళ్ళ ముందుకు వస్తాయి. ఈ పండుగ కేవలం రంగులతో ఆడుకునే పండగ మాత్రమే కాదు.. పరస్పర ప్రేమ, సోదరభావం, నూతన ప్రారంభాలకు కూడా చిహ్నం. భారతదేశంలో హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రపంచంలోని అనేక దేశాలలో కూడా హోలీ పండగను సంతోషంగా జరుపుకుంటారు. భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశం, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్‌లలో ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
భారతదేశంలో మాత్రమే కాదు అనేక ఇతర దేశాలలో కూడా హోలీని ఉత్సాహంతో జరుపుకుంటారని తెలుసా.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు సహజంగా ఈ రంగురంగుల పండుగను తమ సంస్కృతి సంప్రదాయాన్ని అనుసరించి అక్కడ ప్రవాసభారతీయులు హోలీని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే భారతదేశంలో మాత్రంమే కాదు ఇతర దేశాల్లో కూడా హోలీ ఎలా జరుపుకుంటారో ఈ రోజు తెలుసుకుందాం..
మన పొరుగు దేశం నేపాల్. ఈ దేశం హిందూ సంస్కృతితో లోతైన అనుబంధాన్ని కలిగి ఉంది. ఇక్కడ హోలీని ఫాగు పౌర్ణమి అని పిలుస్తారు. దీనిని దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఖాట్మండు, పోఖారా వంటి పెద్ద నగరాల్లో హోలీ రోజున వీధులు రంగులు, సంగీతం, నృత్యాలతో నిండి ఉంటాయి. నేపాలీ ప్రజలు ఒకరినొకరు రంగులు, నీటి బుడగలు, గులాల్‌తో రంగులు జల్లుకుంటూ సందడి చేస్తారు.
మారిషస్‌లో ఎక్కువ మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇక్కడ స్థానికులు భారతీయ ములాలున్నవారు హోలీని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక్కడ హోలీ వేడుక భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ , బీహార్‌లలో జరిగే హోలీని పోలి ఉంటుంది. భజన-కీర్తన, హోలిక దహనం, రంగులతో ఆడుకునే సంప్రదాయాన్ని చూడవచ్చు. మారిషస్ ప్రభుత్వం కూడా ఈ పండుగను గుర్తించి జాతీయ సెలవుదినంగా ప్రకటించింది.
ఫిజీ అనేది భారతీయులు అధిక సంఖ్యలో నివసించే దేశం. ఈ దేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వెళ్ళిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని నమ్ముతారు. ఇక్కడ హోలీని సాంప్రదాయకంగా సంగీతం, నృత్యాలతో జరుపుకుంటారు. స్థానిక ప్రజలు కూడా ఈ పండుగ సందర్భంగా రంగులతో సందడి చేస్తారు. ఫిజీ దేశస్తులు హోలీని బహుళ వర్ణ పండుగగా జరుపుకుంటారు.
భారతదేశ విభజన తర్వాత కూడా.. చాలా మంది హిందువులు పాకిస్తాన్‌లో నివసిస్తున్నారు. ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్, కరాచీ, లాహోర్ సహా మరికొన్ని ప్రాంతాలలో నివసించే హిందూ కుటుంబాలు హోలీని ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు. హిందూ దేవాలయాలు, కమ్యూనిటీ కేంద్రాలు గొప్ప హోలీ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. పాకిస్తాన్ ప్రజలు ఒకరిపై ఒకరు గులాల్ , రంగులు పూసుకుని పండుగ జరుపుకుంటారు.
బంగ్లాదేశ్‌లో కూడా హిందూ హోలీ వేడుకలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఢాకా, చిట్టగాంగ్ , సిల్హెట్ వంటి ప్రాంతాలలో హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. హోలీని ఇక్కడ డోల్ పూర్ణిమ లేదా బసంత ఉత్సవం అని కూడా పిలుస్తారు. భారతీయుల వలెనే ఆ దేశంలోని హిందూ ప్రజలు రంగులతో, గులాల్‌తో ఆడుకుంటారు. దేవాలయాలలో ప్రత్యేక పూజలు , హవనాలు నిర్వహిస్తారు.