
మేషం: సాధారణంగా ఈ రాశివారికి ఆరోగ్యం మీదా, శరీర దార్ఢ్యం మీదా శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య సూత్రాలను ఎక్కువగా పాటిస్తారు. వీరిని ఎక్కువగా బీపీ, చర్మవ్యాధులు, నిద్రలేమి, శిరోభారం, నేత్ర సంబంధమైన సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే, వీరికి జూన్ 3నుంచి గురువు నాలుగవ స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల అనారోగ్యాల నుంచి క్రమంగా ఉపశమనం లభిస్తుంది. రాశ్యధిపతి కుజుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.

వృషభం: ఈ రాశివారికి ఒకపట్టాన అనారోగ్యాలు దగ్గరకు రావు. వస్తే తొందరగా విడిచిపెట్టవు. సాధారణంగా వీరు ఎక్కువగా ఆహార నియమాలు పాటించడం జరుగుతుంటుంది. ఈ రాశివారిని ఎక్కువగా కొలస్టెరాల్, థైరాయిడ్, డయాబెటిస్, స్థూలకాయం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ద్వితీయంలో గురువు, లాభ స్థానంలో శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి తీవ్రస్థాయి అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. అనారోగ్యాలు కలిగినా వెంటనే కోలుకోవడం జరుగుతుంది.

కర్కాటకం: ఈ రాశివారికి తేలికగా అనారోగ్యాలు పట్టుకుంటూ ఉంటాయి. వీరు ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. వీరికి ఎక్కువగా గుండె, ఛాతీ సమస్యలకు ఆస్కారముంటుంది. ఎలర్జీ సమస్యలు కలుగుతుంటాయి. ప్రకృతిలో మార్పు వచ్చినప్పుడల్లా వీరు అనారోగ్యాలతో ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. జూన్ నెలలో ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టడంతో పాటు, శని కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి అనారోగ్యం నుంచయినా వీరు కోలుకుంటారు.

తుల: ఈ రాశివారు సాధారణంగా కడుపు, వెన్నముక, ఎముకలు, చర్మ సంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. శని, గురువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ ఏడాది వీరు ఎక్కువ కాలం అనారోగ్యాలకు గురయ్యే అవకాశం లేదు. ఏదైనా అనారోగ్యం పట్టుకున్నా దాని నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. వీరు ఆరోగ్యం విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు పాటించడం మంచిది. శని అనుకూలత వల్ల వీరు త్వరలో అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది.

ధనుస్సు: ఈ రాశివారు ఎక్కువగా విష జ్వరాలు, అంటువ్యాధులు, డయాబెటిస్, కీళ్ల నొప్పులు ఎముక వ్యాధులు, పుండ్లు, కణుతులతో అవస్థలు పడుతుంటారు. అతిగా శ్రమ పడడం వల్ల కూడా అనారోగ్యాలు కలుగుతుంటాయి. ఈ ఏడాది వీరిని ఏ అనారోగ్యాలూ బాధించే అవకాశం లేదు. ఏవైనా అనారోగ్యాలున్నా వీరు పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది. గురు, శనుల బలంతో పాటు ముందు జాగ్రత్తలు పాటించడం, ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలుండవు.

మకరం: ఈ రాశివారిని ఎక్కువగా నడుం నొప్పి, రక్త సమస్యలు, కీళ్ల నొప్పులు, నరాల సమస్యలు పీడిస్తుంటాయి. సాధారణంగా ఈ రాశివారు ఆహార, విహారాల్లో క్రమశిక్షణ పాటించడం, వ్యసనాలకు దూరంగా ఉండడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వంటివి జరుగుతుంటాయి. అందు వల్ల వీరు అంత త్వరగా అనారోగ్యాలకు గురికావడం జరగదు. శని, గురు, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు ఎటువంటి అనారోగ్యాల నుంచయినా కోలుకోవడం జరుగుతుంది.