
మేషం: రాశ్యధిపతి కుజుడు కొత్త సంవత్సరమంతా పూర్తిగా అనుకూలంగా ఉండబోతున్నందువల్ల ఈ రాశివారు ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో తప్పకుండా ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. బుధుడు మార్చి నుంచి, గురువు జూన్ నుంచి అనుకూలంగా మారుతున్నందువల్ల బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఉద్యోగాలకు ప్రయత్నించడం కూడా మంచిది. వీరికి సొంత ఊర్లో ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంది.

కర్కాటకం: ఈ రాశికి జనవరి 15 నుంచి కుజ, రవులు అనుకూలంగా మారడం వల్ల ఈ రాశివారు ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. ఎటువంటి పోటీ పరీక్షలు, రాత పరీక్షల్లోనైనా వీరు నెగ్గే అవకాశం ఉంది. జూన్ నుంచి గురువు ఇదే రాశిలో ఉచ్ఛపడుతున్నందు వల్ల ఈ రాశివారికి ప్రభుత్వంలో ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. బాగా దూర ప్రాంతంలో వీరు ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది.

సింహం: రాశ్యధిపతి రవితో పాటు కుజుడు కూడా జనవరి నుంచి అనుకూలంగా మారడం వల్ల ఈ రాశి వారికి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వంలో గానీ, బ్యాంకుల్లో గానీ ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. కొద్ది ప్రయత్నంతో జూన్ లోపు వీరి కల సాకారం అవుతుంది. సొంత ఊర్లో వీరికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. గురువు అనుకూలత వల్ల వీరికి కోరిక నెరవేరుతుంది.

వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు ఉచ్ఛ, మిత్ర క్షేత్రాలలో సంచారం చేయడం, రవి కూడా అనుకూల స్థానాల్లో ప్రవేశించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగానికి ఈ రాశివారికి బాగా అవకాశం ఉంది. ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో మే లోపు ఆశించిన ప్రభుత్వ ఉద్యోగం లభించడం జరుగుతుంది. జూన్ నుంచి గురువు కూడా ఉచ్ఛపడుతున్నందువల్ల వీరు ప్రభుత్వ ఉన్నతోద్యోగులకు సంబంధించిన రాత పరీక్షలు, ఇంటర్వ్యూలకు తయారు కావడం మంచిది. తప్పకుండా వీరి కల, కోరిక నెరవేరుతాయి.

ధనుస్సు: ఈ రాశివారికి రవి, కుజులే కాక, గురువు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త సంవత్సరంలో ఆశించిన ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బ్యాంకు ఉద్యోగాలకు కూడా బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించడానికి గురువు తోడ్పడడం జరుగుతుంది. ముఖ్యంగా వీరు జూన్ లోపు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. వీరికి ఉన్నత పదవులకు కూడా బాగా అవకాశం ఉంది.

కుంభం: ప్రభుత్వ ఉద్యోగాలకే కాక, అధికారానికి కూడా కారకులైన కుజ, రవి గ్రహాలు ఫిబ్రవరి నుంచి ఈ రాశి మీద నుంచి సంచారం చేస్తున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో వీరికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, రాత పరీక్షలు, ఇంటర్వ్యూలలో వీరు తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. గురు బలం కూడా తోడవుతున్నందువల్ల వీరికి ఉన్నత పదవులు, భారీ జీత భత్యాలు లభించే అవకాశం కూడా ఉంది. సొంత ఊర్లో ప్రభుత్వ ఉద్యోగం లభించడం జరుగుతుంది.