
మరణం అనేది సహజం. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు, మరణించిన ప్రతి జీవి పుట్టక తప్పదు అనే నానుడి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అందుకే చావు పుట్టుకలు అనేవి కామన్. కానీ కుటుంబంలో ఎవరైన మరణిస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఆ కుటుంబం మొత్తం తీవ్రమైన దుఃఖంలో కూరుకుపోతుంది. చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించి, 13 రోజుల పాటు వారి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

అయితే ఏ వ్యక్తి అయినా సరే మరణించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు అందరూ తెల్లటి వస్త్రాలు ధరిస్తారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా చనిపోతే తెల్లటి వస్త్రాలు ఎందుకు ధరిస్తారో? కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యులు తెల్లటి వస్త్రాలు ధరించడం వెనుక ఆ చార సంప్రదాయం ఉంది. తెలుపు రంగు అనేది శాంతి, స్వచ్ఛత, ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది. అందువలన ఇలాంటి విచారకరమైన సందర్భాల్లో తెల్లటి వస్త్రాలు ధరిస్తారంట.

తెల్లని దుస్తులు ధరించడం వలన దుఃఖ సమయంలో కుటుంబ సభ్యుల మనస్సును ప్రశాంత పరిచి, మానసిక శాంతి కలుగుతుందంట. అలాగే హిందూ మతం ప్రకారం సత్యం, జ్ఞానం, సద్భావన అనే వాటిని తెలుపు రంగు సూచిస్తుంది కాబట్టి, దానికి చిహ్నంగా తెలుపు రంగు దుస్తులు ధరిస్తారంట.

అలాగే మరణించిన ఆత్మకు శాంతి చేకూర్చడానికి తెల్లటి వస్త్రాలు ధరిస్తారంట. మరణం తర్వాత ఆత్మ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అప్పుడు ఆత్మ కుటుంబ సభ్యులు తెల్లటి దుస్తులు ధరించి, ప్రశాంతమైన వాతావరణం కొనసాగించడం వలన మరణించిన ఆత్మ, శాంతిని పొందుతుందంట.