
ఏలూరు: వినాయక చవితి పర్వదినం వచ్చిందంటే చాలు.. వీధి వీధినా ఆధ్యాత్మిక శోభ వెల్ల విరుస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గణనాథుడి మండపాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, వినూత్న రీతుల్లో తీర్చిదిద్దుతుంటారు. ముఖ్యంగా నేటి రోజుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుండటంతో మట్టి వినాయకులతో పాటు ప్రకృతి సిద్ధమైన వస్తువులతో తయారు చేసిన విగ్రహాల వైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కొలువుదీరిన ‘ఎకో గణపతి’ భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాడు.

500 కిలోల కూరగాయలతో వినూత్న రూపం. భీమవరంలో ప్రత్యేక గణపతిని ప్రతిష్టించారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేయించిన వినాయక ప్రతిమను ఇక్కడికి తీసుకొచ్చి, పండ్లు, ఆకులు, పూలు, కూరగాయలతో అద్భుతంగా అలంకరించారు. అమ్మవారి శాకాంబరీ అవతారాన్ని గుర్తుకు తెచ్చేలా రూపొందించిన ఈ మండపం చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తోంది.

ఈ అలంకరణ కోసం దాదాపు 500 కిలోల కూరగాయలను వినియోగించారు. అందులో బీరకాయలు, ఆనపకాయలు, పొట్లకాయలు, వంకాయలు, ములక్కాడలు, గుమ్మడికాయలు, క్యారెట్, బీట్‌రూట్, క్యాప్సికమ్ వంటి తాజా కూరగాయలతో పాటు వివిధ రకాల పండ్లు, పత్రాలు, సుగంధ భరిత పుష్పాలను పొందికగా అమర్చి వినాయకుడికి సరికొత్త శోభను తీసుకొచ్చారు.

ఈ వినూత్న ఆలోచన గురించి గణపతి ఉత్సవాల నిర్వాహకులు పెన్మత్స వెంకట రామరాజు మాట్లాడుతూ ప్రకృతితో మమేకమై పండుగలు జరుపుకోవడమే మన సంప్రదాయం. తొలి పూజలందుకునే విఘ్నేశ్వరుడిని ఆరాధించేటప్పుడు ప్రకృతికి ఎలాంటి హాని కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ ఏకో గణపతిని ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను గుర్తెరిగి మెలగాలంటున్నారు.

వృథా కాకుండా పేదలకు పంపిణీ..వినాయక చవితి పూజలు ముగిసిన అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదే సమయంలో మండప అలంకరణకు వినియోగించిన 500 కిలోల కూరగాయలు, పండ్లను ఏమాత్రం వృథా చేయకుండా స్థానిక నిరుపేదలకు పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. భక్తితోభక్తితో పాటు సామాజిక స్పృహను, సేవాభావాన్ని చాటుతున్న ఈ వినూత్న ‘ఎకో ఫ్రెండ్లీ’ ప్రయత్నాన్ని స్థానికులు, భక్తులు వేనోళ్ల కొనియాడుతున్నారు.