భగవద్గీతలోని 18 ఆధ్యాయాల్లో 700 శ్లోకాలు వేద పండితులు, భక్తుల కంఠాల నుండి వెలువడిన శ్లోకాల జరిలో సాక్షత్తు శ్రీకృష్ణ భగవానుడు తన్మయం చెంది విశ్వరూప దర్శనాన్ని పునః ఆవిష్కరించాడా అన్న చందాన ఈ భగవద్గీత అఖండ పారాయణ యగ్నం జరిగింది.
శ్రీ భగవద్గీత అఖండ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆచార్య కుప్పా విశ్వనాధ శర్మ మాట్లాడుతూ గీతా పారాయణం జరిగే చోట శ్రీ మహావిష్ణువు, సమస్త తీర్థాలు, ప్రయాగాది పుణ్య క్షేత్రాలు, ముక్కోటి దేవతలు, మహర్షులు కొలువై ఉంటారని చెప్పారు.
పురాణాలల్లో తెలిపిన విధంగా గీతా పారాయణం చేయడం వలన తత్వజ్ఞానాన్ని పొంది పరమాత్మను చేరుకుంటారన్నారు. భగవద్గీతలో సగం మాత్రమే పారాయణం చేసిన వారు ఈ భూమి మొత్తన్నిదానంగా ఇచ్చిన పుణ్యాన్ని పొందుతారన్నారు. మూడవ వంతు గీతా పారాయణం చేసిన వారు గంగా స్నానం చేసిన ఫలితం, ఆరవ వంతు పారాయణం చేసిన వారు సోమయాగం చేసిన ఫలితం, ఒకే ఆధ్యాయాన్ని నిత్యం పారాయణం చేసేవారు రుద్రలోకాన్ని పొంది రుద్రుడి యొక్క ప్రమధ గణాల్లో ఒకరవుతారని తెలిపారు.
ఎవరైతే ఒక అధ్యాయం, ఒక శ్లోకం, ఒక పాదం చదువుతారో వారికి మానవ జన్మ కంటే తక్కువ జన్మ కలగదని తెలిపారు. అదేవిధంగా ఒకటి నుండి పది శ్లోకాలు గాని, కనీసం ఒక అక్షరం చదువుతారో వారు చంద్రలోకం పొంది, 10 వేల సంవత్సరాల పాటు అక్కడ భోగాలను అనుభవిస్తారని భగవద్గీత తెలుపుతుందని వివరించారు.
అఖండ పారాయణంలో ఆచార్య కాశీపతి సోమయాజులు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు పాల్గొన్నారు.
శ్రీ భగవద్గీత అఖండ పారాయణం సందర్బంగా గీతోపదేశం చేస్తున్న శ్రీ కృష్ణుడు, ధనుర్భాలను విడిచిన అర్జునుడి విగ్రహలు, కపిధ్వజ రథం సెట్టింగ్, శ్రీ మహా విష్ణవు విశ్వరూప దర్శనం ప్లెక్సీ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి వందన బృందం అన్నమాచార్యులవారి సంకీర్తన ” తెలిసితే మోక్షము తెలియకున్న బంధము...“, అనే సంకీర్తనను కార్యక్రమం ప్రారంభంలో, ” వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనమ్ ..” అనే శ్రీకృష్ణాష్టకమ్ కార్యక్రమం ముగింపులో సుమధురంగా అలపించారు.