శరీరంలో సోడియం కంటెంట్ పెరగడం వల్ల బీపీ ఎక్కువ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటని చెబుతున్నారు. అందుకే బీపీ ఉన్న వారు ఉప్పును వీలైనంత వరకు తగ్గించాలని చెబుతున్నారు.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం ఒక వ్యక్తి రోజులో 1,500 మిల్లీగ్రాములకు మించి ఉప్పును తీసుకోకూడదని చెబుతున్నారు. బీపీతో బాధపడేవారు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
అధ్యయనం ప్రకారం భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు 8 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నాడు. అయితే ఆరోగ్య నిపుణులు సూచించిన దాని ప్రకారం రోజుకు కేవలం 5 గ్రాముల ఉప్పును మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.
నేషనల్ నాన్-కమ్యూనికేబుల్ డిసీజ్ సర్వైలెన్స్ సర్వే (NNMS)లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో భాగంగా 3000 మంది నమూనాలను సేకరించి ఈ విషయాన్ని వెల్లడించారు. సర్వేలో భాగంగా వీరి మూత్రంలో సోడియం స్థాయిలను పరిశీలించారు.
మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు కూడా వీలైనంత వరకు ఉప్పును తగ్గించాలని చెబుతున్నారు. రోజు తీసుకునే ఆహారంలో సోడియం మొత్తాన్ని కనీసం 1.2 గ్రాములు తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.