
చాలా మందికి ముక్క లేనిదే ఒక్క పూట కూడా ముద్ద దిగదు. చికెన్, మటన్ ఏదైనా సరే తప్పక వారి మెనూలో ఉండాల్సిందే. అయితే చాలా మంది రెడ్ మీట్ ఎక్కువగా తింటారు. కానీ దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జరిగే అనర్ధాల గురించి పట్టించుకోరు. నిజానికి ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం.

వారానికి 1 లేదా 2 సార్లు రెడ్ మీట్ తినవచ్చు. ఒకేసారి 80 నుంచి 100 గ్రాముల వండిన రెడ్ మీట్ తినడం ఆరోగ్య కరం. ఇలా వారానికి మొత్తం 300 నుంచి 350 గ్రాములకు మించకూడదు. ఎందుకంటే ఎక్కువ రెడ్ మీట్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, కొవ్వు కాలేయం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

అందువల్ల రెడ్ మీట్ మితంగా తినడం, తక్కువ కొవ్వు ఉన్న ముక్కలను ఎంచుకోవడం, తక్కువ నూనెలో ఉడకబెట్టడం ఆరోగ్యకరం. నిపుణుల ఆహార మార్గదర్శకాల ప్రకారం నెయ్యి, వెన్న, పూర్తి కొవ్వు పాలు వంటి సంతృప్త కొవ్వులతో ఎంత ప్రమాదమో రెడ్ మీట్‌తోనూ అంతే ప్రమాదమని చెబుతున్నారు.

కొవ్వు కాలేయ రోగులు రెడ్ మీట్ తినవచ్చు, కానీ పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. రెడ్ మీట్‌లో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. కాబట్టి, దానిని ఎక్కువగా తినడం వల్ల కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కొవ్వు కాలేయ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. అందువల్ల మీరు వారానికి ఒకసారి వైద్యుడి సలహా మేరకు దీనిని తీసుకోవచ్చు.

ఆహారంలో రెడ్ మీట్ తీసుకోవడం తప్పనిసరి కాదు. శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఇనుము, విటమిన్లు, ఇతర పోషకాలను పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, పాలు, పెరుగు, జున్ను, గుడ్లు, చేపలు, సోయాబీన్స్, వేరుశెనగ వంటి ఆహారాల ద్వారా కూడా అందుతుంది.