
మగువలు పదిలంగా చూసుకునే కురులు కళ్లముందే రాలిపోతుంటే చూసి తట్టుకోలేరు. ఏ షాంపూ వల్ల జుట్టు రాలడం తగ్గుతుందో.. హెయిర్ మాస్క్ వల్ల జుట్టు పెరుగుతుందో.. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి.. వంటి పలు విషయాలను నిత్యం గూగుల్ వెతికేస్తుంటారు. కానీ శాశ్వత పరిష్కారం దొరక్క మదనపడిపోతుంటారు. గుమ్మడి విత్తనాలతో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.

గుమ్మడికాయ విత్తనాలను కూడా తినడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే జుట్టు సమస్యల నివారణకు ఎంతో ఉపయోగపడుతుంది. గుమ్మడికాయ గింజల్లో విటమిన్లు A, B, C, ఐరన్, ప్రోటీన్, మెగ్నీషియం, జింక్, రాగి, భాస్వరం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు గుమ్మడి గింజల్లో అధికంగా ఉంటాయి. ఇది స్కాల్ప్ ను తేమగా ఉంచడంతోపాటు ఇన్ఫెక్షన్ నుంచి స్కాల్ఫ్‌ను రక్షిస్తుంది. ఇది హెయిర్ ఫోలికల్స్‌కు పోషణనిస్తుంది. జుట్టు రాలడం, చిట్లడాన్ని నివారిస్తుంది.

గుమ్మడి గింజలు జుట్టు రాలడాన్ని నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని 2019లో నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. గుమ్మడికాయ గింజల నూనె జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. ఈ విత్తనాలు జుట్టుకు బలం చేకూర్చి పోషణ అందిస్తాయి.

గుమ్మడికాయ గింజల్లోని విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంచుంది. దీంతో జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో గుమ్మడి గింజలను తినడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. గుమ్మడికాయ గింజల నూనెను కూడా ఉపయోగించవచ్చు.

అలాగే గుమ్మడికాయ గింజలతో హెయిర్ మాస్క్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. గుమ్మడి గింజలు, తేనె, కొబ్బరి నూనె, పెరుగు సమపాళ్లలో కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తల మాడుకు, కుదుళ్లకు, జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి తలస్నానం చేస్తే సరి.