
పోస్టాఫీసు MIS పథకం అంటే?: పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో మీరు పదే పదే డబ్బు జమ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్కసారి మాత్రమే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే సరిపోతుంది. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం 7.4 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ ప్రతి నెలా నేరుగా మీ సేవింగ్స్ ఖాతాలో జమ అవుతుంది. మీరు ఆ డబ్బును ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు లేదా మీ అవసరాలకు వాడుకోవచ్చు.

పెట్టుబడి పరిమితులు ఇవే: ఈ పథకంలో చేరడం చాలా సులభం. కేవలం రూ. 1,000తో ఖాతా తెరవవచ్చు. ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 9 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇందులో గరిష్ట పరిమితి రూ. 15 లక్షలు మాత్రమే.

ఆదాయం ఎంత?: మీరు సింగిల్ ఖాతాలో గరిష్ట పరిమితి అయిన రూ. 9 లక్షలు డిపాజిట్ చేశారనుకుందాం. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం.. మీకు ప్రతి నెలా రూ. 5,550 వడ్డీ రూపంలో ఆదాయం లభిస్తుంది. ఐదు సంవత్సరాల కాలపరిమితి ముగిసే వరకు ఈ ఆదాయం స్థిరంగా వస్తూనే ఉంటుంది. ఇది మీ నెలవారీ ఇంటి ఖర్చులకు లేదా ఇతర అవసరాలకు ఒక బలమైన ఆర్థిక ఆధారంగా మారుతుంది.

అసలుకు భరోసా: ఈ పథకం అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే.. మీ అసలు సొమ్ము ఎక్కడికీ పోదు. MIS పథకానికి 5 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఐదేళ్ల పాటు ప్రతి నెలా వడ్డీని పొందిన తర్వాత మీరు మొదట ఎంతైతే డిపాజిట్ చేశారో ఆ మొత్తం మీకు తిరిగి ఇచ్చేస్తారు. అంటే మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితంగా ఉండటమే కాకుండా లాభాన్ని కూడా ఇస్తుంది.

అకౌంట్ ఎలా తెరవాలి?: మీరు ఈ పథకంలో చేరాలనుకుంటే.. ముందుగా మీ దగ్గరలోని పోస్టాఫీసులో ఒక సేవింగ్ అకౌంట్ ఉండాలి. అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి ఖాతాను ఓపెన్ చేయవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన మరుసటి నెల నుండే మీ నెలవారీ ఆదాయం ప్రారంభం అవుతుంది. సురక్షితమైన పెట్టుబడితో పాటు క్రమబద్ధమైన ఆదాయం కోరుకునే రిటైర్డ్ వ్యక్తులకు, గృహిణులకు ఇది అత్యంత ప్రయోజనకరమైన స్కీమ్.