
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 24వ తేదీతో (ఆదివారం) పదవీ విరమణ చేయబోతున్నారు.

ఈ సందర్భంగా ఆయన గౌరవార్థంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం రాత్రి ఢిల్లీలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు.

ఈ విందు కార్యక్రమానికి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు.. కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.

వారితోపాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, పద్మ అవార్డుల గ్రహీతలు, గిరిజన నాయకులు పాల్గొన్నారు.

ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరి హాజరయ్యారు.

కాగా.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నేరుగా ఆహ్వాన కార్డులు పంపడానికి సమయం లేకపోవడంతో.. ఢిల్లీలోని ఆ రాష్ట్రభవన్‌ల రెసిడెంట్ కమిషనర్లకు వాటిని అందిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం అంతకుముందు వెల్లడించింది.

వారు హోంశాఖ కార్యాలయం నుంచి నేరుగా కార్డులను తీసుకొని తమ సీఎంలు, డిప్యూటీ సీఎంలకు పంపించాలని సూచించింది. అయితే..

ఈ కార్యక్రమానికి బీజేపీ, ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన

ఆంధ్రప్రదేశ్, ఒడిశా సీఎంలనూ మాత్రమే ప్రధానమంత్రి కార్యాలయం ఆహ్వానితుల జాబితాలో చేర్చింది.