
ఇంత వరకు రోడ్డు, రైలు మార్గాలే అందుబాటులో ఉండే ఈ కర్నూలు జిల్లాలో ఇక మీదట నుంచి విమాన ప్రయాణం కూడా జరుగబోతుందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. రూ.110 కోట్లతో ఏడాదిన్నరలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును పూర్తిచేశామన్నారు జగన్.

తొలి దశ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నివాళిగా.. ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టుగా నామకరణం చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు ప్రారంభించి జాతికి అంకితమిచ్చిన అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు.

ఈనెల 28వ తేదీ నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు మొదలవుతాయని, ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం నగరాలకు విమాన సర్వీసులు మొదలవుతాయని సీఎం స్పష్టం చేశారు.

ఒకేసారి నాలుగు విమానాలు పార్కు చేసుకునే విధంగా ఎయిర్‌పోర్టులో సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు సీఎం జగన్. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఐదు విమానాశ్రయాలు ఉంటే, కర్నూలు 6వ విమానాశ్రయం కాబోతుందని సీఎం తెలిపారు.

ఏపీలో తిరుపతి, కడప, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి ఎయిర్‌పోర్టులు ఇప్పటికే సర్వీసులు అందిస్తున్నాయని సీఎం గుర్తు చేశారు.

ఈ ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు మనందరం నిర్మించుకోబోతున్న న్యాయరాజధానిలో మిగతా ప్రాంతాలు, మిగతా రాష్ట్రాలను కలిపే ఎయిర్‌పోర్టుగా నిలబడుతుందని జగన్ పేర్కొన్నారు.

ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి హాజరైన అశేష జనవాహిని