
పీరియడ్స్ సమయంలో మహిళలకు తీవ్ర కడుపునొప్పి వేధిస్తుంది. ముఖ్యంగా పొత్తి కడుపులో భరించలేనంత నొప్పి వస్తుంది. ఈ సమయంలో మానసిక ఆరోగ్యం కూడా కొంత అలజడికి గురవుతుంటుంది. దీంతోపాటు శారీరక అలసట. ప్రతి మహిళ పీరియడ్స్ సమయం ఇవన్ని భరిస్తుంటుంది. వైద్య పరిభాషలో దీనిని పీరియడ్ ఫెటీగ్ అంటారు. ఈ బాధలన్నీ భరిస్తూనే చాలా మంది తమ రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు.

పీరియడ్స్ ఫెటీగ్ లక్షణాలు ఇవే.. పొత్తికడుపు నొప్పి, ఉబ్బరం, తరచుగా మూడ్ స్వింగ్స్, తలనొప్పి. ప్రధానంగా ఈ సమయంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా శారీరక అలసట ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

చాలా మంది మహిళల్లో ఐరన్ లోపం ఉంటుంది. ఇక పీరియడ్స్ సమయంలో ఐరన్ స్థాయిలు తరచుగా తగ్గుతుంటాయి. శారీరక అలసటకు ఇది కూడా ఒక కారణం. కానీ ఈ శారీరక అలసట నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. నిజానికి రుతుక్రమ సమస్యలను ఎదుర్కోవాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి. అంటే శరీరంలో ఎలాంటి పోషకాహార లోపం ఉండకూడదు. అందుకే ఐరన్, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే, టీ-కాఫీ, చక్కెర, ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి.

శరీరం డీహైడ్రేషన్‌కు గురైతే మరింత అలసిపోయినట్లు అనిపిస్తుంది. కాబట్టి ఎక్కువ నీరు తాగాలి. ఫలితంగా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు. అలాగే మద్యం, టీ, కాఫీలు తాగకూడదు. దీంతో డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. ఈ సమయంలో వ్యాయామం చేయడం వల్ల అధిక రక్తస్రావం అవుతుందని చాలా మంది అనుకుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. పీరియడ్స్ సమయంలో తేలికపాటి వ్యాయామం చేస్తే శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

దిగువ కడుపు నొప్పి, కండరాల నొప్పులను తగ్గించి, శరీరానికి శక్తిని అందిస్తుంది. ఆహారం, వ్యాయామంతో పాటు, శరీరానికి తగినంత నిద్ర కూడా అవసరం. నెలసరి అలసటను తొలగించడానికి రాత్రి పూట 7-8 గంటల నిద్ర అవసరం. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, శారీరక అలసటను తొలగించడానికి మీకు సహాయపడుతుంది.