తమకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని, గిన్నిస్ రికార్డు సాధించాలని చాలామంది వింత విన్యాసాలు చేస్తుంటారు. వారు చేసే విన్యాసాల కోసం కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు పాటు కసరత్తులు చేస్తారు. ప్రాణాలకు తెగించి మరి విన్యాసాలు చేసి రికార్డులు సృష్టించేందుకు పరితపిస్తుంటారు.
తాజాగా నైజీరియన్‌కు చెందిన టెంబు డేనియల్ అనే వ్యక్తి ఏడుపుపై విన్యాసం చూపించాడు. 100 గంటల పాటు ఆగకుండా ఏడుస్తూ రికార్టు కొల్లగొట్టాలనే ప్రయత్నం చేశాడు.
డేనియల్ అలా నిరంతరాయంగా ఏడుస్తుండగా అతని శరీరం సహకరించలేదు. దీంతో మధ్యలోనే ఏడుపు ఆపేశాడు. జులై 9న డేనియల్ 100 గంటల ఏడుపు మారథాన్‌ను ప్రారంభించాడు.
డేనియల్ ఏడుస్తుండగా ఆరుగంటల్లో కొన్ని దుష్ఫ్రభావాలు ఎదుర్కొన్నారు. తలనొప్పి, ముఖం ఉబ్బిపోవడం, కళ్ల వాపు లాంటి లక్షణాలు అతనిలో కనిపించాయి. అంతేకాదు సుమారు 45 నిమిషాల పాటు అతనికి ఏమి కనిపించని పరిస్థితి నెలకొంది.
చివరికి ఈ ఏడుపు మారథాన్ కొనసాగిస్తే ప్రమాదని తెలిసి మధ్యలోనే ఆపేసినట్లు డేనియల్ చెప్పాడు. అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన వీడియోలను పంచుకున్నాడు. అందులో టైమర్ 2 గంటల 9 నిమిషాలు, 5 గంటల 54 నిమిషాల వద్దే ఉంది.