
జీవన శైలి సమస్యల్లో అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) సాధారణమై పోయింది. 50 ఏళ్ల తర్వాత పలకరించవల్సిన ఈ బీపీ సమస్య 20 ఏళ్లకే వస్తోంది. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరించడం, ఇతర అంశాల వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశాలున్నాయి.

స్థూలకాయం, నిద్రలేమి, ఉప్పు అధికంగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, గర్భ నిరోధక మాత్రలు వాడకం, పెయిన్ కిల్లర్ మాత్రల అధిక వినియోగం.. వంటి కారణాల వల్ల అధిక రక్తపోటు తలెత్తుతుంది. ఐతే ఈ ఆహారాలు తీసుకోవడం ద్వారా బీపీని అదుపు చేయవచ్చంటున్నారు నిపుణులు.

కొబ్బరి నీళ్లతో శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటమేకాకుండా.. కావాల్సిన శక్తి అందుతుంది. బీపీ కూడా అదుపులో ఉంటుంది. కొబ్బరి నీళ్లలోని పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ‘సి’.. వంటివన్నీ సిస్టాలిక్ రక్తపోటును తగ్గించడంలో తోడ్పడతాయి.

ఉల్లిపాయల్ని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి బయటపడవచ్చు. రోజూ పరగడుపున రెండు చెంచాల తేనె తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే తులసి రసం, తేనె సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని కూడా ప్రయత్నించచ్చు.

రోజుకు రెండు అరటిపండ్లు తినడం, అల్లాన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం, కూరల్లో ఉప్పు తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. వంటి చిన్నపాటి అలవాట్ల వల్ల అధిక రక్తపోటును సహజ పద్ధతుల్లో అదుపు చేయవచ్చు.