
ఆవనూనె వంటకు మంచి రుచిని ఇవ్వడమే కాదు.. తరచూ ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలం, చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు తరచూ వేధిస్తూ ఉంటాయి. వాటి నుంచి ఉపశమనం పొందడానికి ఆవ నూనె తోడ్పడుతుంది. ఆస్తమా లక్షణాలను తగ్గించడానికి ఆవనూనె సాయపడుతుంది. ఆస్తమాతో ఇబ్బంది పడేవారు డైట్‌లో ఆవాలు, ఆవనూనె తీసుకుంటే మంచిది.

ఆవనూనెలో ఉండే ఒమెగా 3,6 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను దరిచేరనీయవు. తరచూ వంటల్లో భాగం చేసుకుంటే గుండె సమస్యల నుంచి రక్షిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. హానికరమైన ఇన్ఫెక్షన్ల నుంచి జీర్ణవ్యవస్థకు రక్షణ కల్పిస్తాయి.

కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి ఆవనూనె ఉపశమనం కలిగిస్తుంది. వాపు, నొప్పి ఉన్నచోట ఆవనూనెతో మర్ధన చేయటం వల్ల సమస్య తగ్గుతుంది. దీని వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరగుపడుతుంది. ఆవనూనె వాడకంతో రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఫలితం ఉంటుంది.

ఆవనూనెలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపుతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఆవనూనె దంత సమస్యలను దూరం చేస్తుంది. నోటి శుభ్రత మెరుగుపడటంతో పాటు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పూర్వకాలంలో చిన్నపిల్లలకు ఇన్ఫెక్షన్లు రాకుండా ఆవనూనెతో మర్ధన చేసేవారు. జలుబు చేస్తే ముక్కు, చెవుల్లో ఆవనూనె చుక్కలు వేసేవారు.

ఆవనూనె తలకు రాసుకోవడం వల్ల కుదుళ్లు బలంగా తయారవుతాయి. కేశాల సంరక్షణకు దోహదపడుతుంది. ఆవనూనె చర్మానికి కూడా మేలు చేస్తుంది. చర్మంలోని ఇన్ఫ్లమేటరీ గుణాలతో ఎగ్జిమా వంటి చర్మ సమస్యలతో పోరాడుతుంది. ఆవనూనెలో చర్మానికి అవసరమైన ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. దీంతో చర్మం బాగా తేమగా, మృదువుగా, సున్నితంగా మారుతుంది. ప్రసవానంతరం ఏర్పడే స్ర్టెచ్ మార్క్స్ పోవడానికి ఆవనూనెలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి రాసుకుంటే ఫలితం ఉంటుంది.