
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు అతలాకుతాలం చేస్తున్నాయి. వర్షాల ధాటికి పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, హర్యాణాలో దీని తీవ్రత అధికంగా ఉంది.

ఢిల్లీలో ఇప్పటికే యమునా నది నీటిమట్టం స్థాయి తారా స్థాయికి చేరింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల ప్రభావానికి పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రహదారులు కూడా ధ్వంసమవ్వడం కలకలం రేపుతోంది.

మరో విషయం ఏంటంటే రైలు పట్టాలపై నీళ్లు చేరగా రైలు ప్రయాణాలూ కూడా రద్దయ్యాయి. జులై 7 నుంచి 15వ తేదీ మధ్యలో 600కుపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు, అలాగే 500కుపైగా ప్యాసింజర్ రైళ్ల రాకపోకలపై వరదల ప్రభావం పడినట్లు రైల్వేశాఖ తెలిపింది.

తొమ్మిది రోజుల్లో దాదాపు 300 ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు కావడం గమనార్హం. అలాగే 191 రైళ్లను దారి మళ్లించామని.. 167 రైళ్ల రాకపోకలను పరిమితం చేశామని రైల్వే శాఖ తెలిపింది.

వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్ తీవ్రంగా ప్రభావమైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 88 మంది చనిపోయారు. 16 మంది గల్లంతైనట్లు సమాచారం. అలాగే చాలా ప్రాంతాల్లో రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి.