
వేసవి వచ్చిందంటే చాలు.. చల్లగా ఏమైనా తాగాలని గొంతు తహతహలాడిపోతోంది. పైగా హైదరాబాద్ నగరంలో ఎండాకాలంలో ఉండే వేడి నుంచి ఉపశమనానికి రెస్టారెంట్లలో నోరూరించే రకరకాల పానీయాల కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టేస్తారు. అందుకే ఈ సీజన్‌లో మీకు బాగా ఉపయోగపడేలా ఒక ప్రదేశాన్ని పరిచయం చేయాలి. అదే పాతబస్తీలోని చార్మినార్ నుంచి కొద్ది నడక దూరంలో ఓ చిన్న దుకాణం. రుచికరమైన చల్లని, ఈ వేసవిలో మీ దాహాన్ని తీర్చే సరైన ప్రాంతం షా అలీ బందాలోని 'మత్వాలే దూద్ ఘర్'.

1967లో స్థాపించబడిన ఈ పాల ఉత్పత్తుల సంస్థ హైదరాబాద్‌లో మొట్టమొదటి ప్రత్యేక లస్సీ దుకాణాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా స్థానిక ప్రజల ఆదరణే కాదు.. వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ దుకాణాన్ని సందర్శించేవారికి ఇక్కడి పానీయాల రుచిని పరిచయం చేసింది. మరీ ముఖ్యంగా హైదరాబాదీలకు చల్లదనాన్నిచ్చే పానీయాలకు ఒక అడ్డాగా మారిపోయింది. ఇక ఇక్కడ దొరికే 'స్పెషల్ లస్సీ' మొత్తం మెనూలోనే తిరుగులేని రాజు.

మనం మామూలుగా బయట తాగే పలుచటి లస్సీలా కాకుండా, మత్వాలే దూద్ ఘర్ వారి లస్సీ ప్రత్యేకంగా నోరూరించే పానీయం. ఫ్రిడ్జుల్లో అలా నిల్వ చేసే విధంగా కాకుండా సహజమైన చల్లదనం ఉంచేందుకు దీన్ని మందపాటి పాత్రల్లో తయారు చేస్తారు. అంతేకాదు.. 40°C మధ్యాహ్నపు వేడిని సైతం తట్టుకునేలా తయారుచేయడమే దీని ప్రత్యేకత. పెరుగు యొక్క మీగడను పొరలు పొరలుగా వేసి, దానిపై స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ మరియు ఖోయాను అలంకరించి, చివరగా దీనిపై రోజ్ సిరప్‌ను చిలకరిస్తారు. దీంతో ఈ పానీయం చూడడానికే కాదు.. రుచిని కూడా ప్రత్యేకంగా పరిచయం చేస్తుంది. మత్వాలే దూద్ ఘర్‌లో బాగా అమ్ముడయ్యే పానీయాల్లో మరొకటి 'స్పెషల్ ఫలూదా'. రోజ్ సిరప్, సహజమైన ఖోయాతో పాటు సహజంగా చల్లదనాన్నిచ్చే సబ్జా గింజలతో అలంకరించి తయారుచేస్తారు. ఇది తాగితే తియ్యదనాన్ని పంచడంతో పాటు ఒంట్లో వేడికి విరుగుడుగానూ పని చేస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది.

మత్వాలే దూద్ ఘర్ ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తెరిచే ఉంటుంది.. ఎప్పుడు చూసినా జనాలతో కిక్కిరిసి సందడిగా ఉంటుంది. ఇక వేసవి సీజన్‌లో అయితే చెప్పాల్సిన పనే లేదు. పవిత్ర రంజాన్ మాసంలో ఈ చిన్న దుకాణం వద్దకు స్థానికులు, పర్యాటకులు పెద్దఎత్తున చేరుకుని ఇక్కడి రుచికరమైన చల్లని గ్లాసు పానీయం తాగితే తప్ప సంతృప్తి చెందరు.

ఇది కేవలం స్థానికంగా మాత్రమే కాదు.. టాలీవుడ్ ప్రముఖుల దృష్టిని కూడా ఆకర్షించింది. ప్రముఖ టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఇక్కడికి తరచుగా వచ్చి చల్లని లస్సీ లేదా ఫలూదాను ఆస్వాదిస్తారు. ప్రస్తుతం కుప్పలుతెప్పలుగా పుట్టుకొస్తున్న రెస్టారెంట్లు, కాఫీ షాపుల మధ్య ఈ మత్వాలే దూద్ ఘర్ వారసత్వపు బలానికి ప్రతీకగా నిలుస్తోంది. ఎండలు మొదలయ్యే మార్చి నెల నుంచి మొదలైన కస్టమర్ల సందడి వేసవి ముగిసినా అలా కొనసాగుతూనే ఉంటుంది.