
జనవరి 26,2026 న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశం మొత్తం ఘనంగా జరుపుకుంది. ముఖ్యంగా ఢిల్లీలో రిపబ్లిక్ వేడుకలు ఆకాశాన్ని అంటాయి. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది కళాకారులు ఢిల్లీ చేరుకొని, తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన కోనసీమా జిల్లా ముక్కామల కళాకారుల బృందం తన ప్రదర్శనతో ఆకట్టుకుంది.

77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో జరిగిన శకటాల ప్రదర్శన కార్యక్రమంలో డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన పసుపులేటి నాగ బాబు కళాకారుల బృందం సభ్యులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

దేశ నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 220 మంది కళాకారులతో నిర్వహించిన హెరాల్డింగ్ ప్రోగ్రామ్లో ఆంధ్రప్రదేశ్ తరపున బృంద సభ్యుడు పసుపులేటి కుమార్ ఆధ్వర్యంలో 20 మంది కళాకారుల బృందం దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి దౌప్రతిముర్ము ఎదుట ప్రదర్శనను అందించారు.

భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సంగీత నాటక అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నాదశ్వరం, డోలు, తాషా, వీరణం, తప్పెటగుళ్ళుతో కళాకారులు ఆకట్టుకున్నారు. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ వేడు కల్లో వరుసగా ఈ ఏడాదితో పసుపులేటి నాగ బాబు కళాకారుల బృందం నాలుగోసారి ప్రదర్శించారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఢిల్లీ రిపబ్లిక్ వేడుకలలో తమ ప్రతిభ కనబరిచిన కోనసీమా జిల్లా ముక్కామల కళాకారుల బృందాన్ని రాష్ట్ర ప్రజలు, అధికారులు అభినందిస్తున్నారు.