
సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం ఏది అనే విషయం వస్తే.. అందులో పాల ఉత్పత్తులు ఎప్పుడూ టాప్‌లోనే ఉంటాయి. ఎందుకంటే ఇందులో మన శరీరానికి అవసరమైన క్యాల్షియం, ప్రొటీన్, విటమిన్ D, విటమిన్ B12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా కండరాల బలానికి, శరీర శక్తికి ఎంతగానో తోడ్పడతాయి.

అయితే మన దేశంలో ఆవులు, గేదెలు, మేకల పాలను పూర్తి శాఖాహారంగానే భావిస్తారు. కానీ అమెరికా వంటి కొన్ని దేశాల్లోని వాణిజ్య పాడి పరిశ్రమలలో పెంచే పశువులకు ఇచ్చే దాణాలో ఫిష్ మీల్, ఇతర జంతు ఉత్పత్తులను కలిపి ఇస్తుంటారనే ప్రచారం కూడా ఉంది. కాబట్టి కొందరు పాలను మాంసాహారంగా చూడాలని అంటారు. కానీ, పాలు శాఖాహారమా కాదా అనేది కేవలం జంతువు తినే ఆహారాన్ని బట్టి డిసైడ్ చేయలేము.

ఇక మన దేశం విషయానికి వస్తే పశువులకు ఎక్కువగా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, జొన్నలు, గోధుమల, నూనె గింజల పిండికంబళ్లను మాత్రమే ఆహారంగా వేస్తారు. కాబట్టి భారతీయ ఆహార నిబంధనల ప్రకారం.. పాలను శాఖాహారంగానే భావించి ప్యాక్ చేసిన పాల ఉత్పత్తులపై కూడా గ్రీన్ మార్క్ లేబుల్‌ను వేస్తారు.

నిజానికి పాలు ఉత్పత్తి అనేది ఒక సహజమైన జీవక్రియ. పశువులు తీసుకునే ఆహారం, నీరు జీర్ణమై రక్తంలోకి పోషకాలుగా చేరుతాయి. క్షీర గ్రంథులు ఈ పోషకాలను వాడుకొని వాటితో పాలను తయారు చేస్తాయి. కాబట్టి, పశువుల దాణాపై రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ, సాంప్రదాయకంగా, చట్టబద్ధంగా మన దేశంలో పాలను పూర్తి శాఖాహార ఆహారంగానే పరిగణిస్తారు.

అయితే, ఇది జంతువు నుండి వచ్చే ఉత్పత్తి కావడం వల్ల 'వీగన్' కొన్ని దేశాల్లోని నిబంధనల ప్రకారం ఇది శాకాహారం కాదని అంటారు.(Note: ఇది ఇంటర్నెట్, నివేదికల నుంచి సేకరించిన సమాచారం ఆదారంగా మాత్రమే అందించబడినది. వీటిని Tv9 దృవీకరించడం లేదు. వీటిపై మీకు సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించవచ్చు.