
భారతదేశంలో కాఫీ తోటలు ఉన్న అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే చాలా కాఫీ తోటలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా జీవితంలో ఒక్కసారైనా తప్పక సందర్శించాల్సిన భారతదేశంలోని ప్రసిద్ధ కాఫీ తోటల గురించి ఈరోజు తెలుసుకుందాం..

మున్నార్: తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన మున్నార్ దక్షిణ భారతదేశంలోని స్వర్గంగా పరిగణించబడుతుంది. పచ్చని పర్వతాలతో అందంగా ఉండే ఈ ప్రదేశంలో మేఘాల దుప్పటి పరచినట్లుగా మరింత అందంగా ఉంటుంది. తేయాకు తోటలు, కర్మాగారాలు మాత్రమే కాదు కాఫీ ఎస్టేట్‌లను కూడా చూడవచ్చు. అనేక ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ స్థలంలో అనేక ప్రభుత్వ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ కాఫీ గింజలను కొనుగోలు చేయవచ్చు. కాఫీ, తేయాకు తోటల సహజ సౌందర్యం దీనిని ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా మార్చింది.

కూర్గ్: దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఇటువంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. వీటి సహజ సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ హిల్ స్టేషన్లలో ఒకటి కూర్గ్. ఇక్కడ అనేక టీ, కాఫీ తోటలు ఉన్నాయి. ప్రజలు కాఫీ గింజలు లేదా టీ ఆకులను కొనుగోలు చేయడానికి ఇక్కడకు వస్తారు. అయితే కూర్గ్ హనీమూన్ గమ్యస్థానంగా కూడా ఉంది. ఇక్కడ జంటలు కాఫీ, టీ తోటల మధ్య రొమాంటిక్ ఫోటోలను తీసుకుంటారు. ఇక్కడ కాఫీ రుచి కూడా బాగుంటుంది. భారతదేశంలో చాలా కాఫీ తోటలు ఉన్నప్పటికీ.. కూర్గ్‌లో మాత్రం కాఫీ తోటలు కనువిందు చేస్తాయి.

చిక్కమగళూరు: కర్నాటకలోని ఈ పర్యాటక ప్రదేశం ప్రకృతి అందాలకే కాకుండా కాఫీ తోటలకు కూడా ప్రసిద్ధి చెందింది. బ్రిటీష్ పాలన కాలంలో మొదటిసారిగా ఇక్కడ కాఫీ పరిశ్రమ ప్రారంభించబడిందని చెబుతారు. నాటి అనేక కాఫీ తోటలు, ప్రభుత్వ దుకాణాలు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి. మీరు కాఫీ ప్రియులైతే ఖచ్చితంగా చిక్కమగళూరులోని అందమైన ప్రపంచాన్ని సందర్శించాలి. ఇక్కడికి వెళ్లిన ఎవరికైనా తిరిగి రావాలని అనిపించదు.

వాయనాడ్: కేరళలోని చాలా ప్రదేశాలు ప్రకృతి అందాలతో నిండి ఉన్నాయి. వాటిల్లో ఒకటి వయనాడ్. ఈ ప్రదేశం ఇప్పుడు రాజకీయ కోణంలో బాగా తెలిసినప్పటికీ.. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. హనీమూన్ కి గమ్య స్థానంగా ప్రసిద్ధి చెందిన వాయనాడ్‌లో అనేక కాఫీ తోటలు ఉన్నాయి. ఇక్కడ కాఫీ తోటల్లో కుటుంబం లేదా భాగస్వామితో తీసుకునే ఫోటోలు జీవితంలో పదిలపరచుకోవచ్చు. ఇక్కడ నుంచి కాఫీ గింజలను సావనీర్‌గా కూడా కొనుగోలు చేయవచ్చు.

అరకు లోయ: అరకు లోయ ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఆర్గానిక్ కాఫీని ఉత్పత్తి చేసిన మొదటి గిరిజన కాఫీ ఉత్పత్తిదారులు ఇక్కడే ఉన్నారని చెప్పారు. ఇక్కడ తూర్పు కనుమలను చింతపల్లి, పాడేరు, మారేడుమిల్లి కాఫీ ఉత్పత్తి చేసే ప్రాంతాలున్నాయి.