
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఒకటవ వార్డు తిమ్మాపురం గ్రామ స్మశాన వాటికలో మృతదేహం దహన సంస్కరాలకి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి. తగిన సౌకర్యాలు లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించే సమయంలో ఇక్కడ ఇబ్బందులు తప్పడం లేదు.

గ్రామంలో ఎవరైనా మరణిస్తే స్మశాన వాటికలో అంత్యక్రియలకు షెడ్ లేకపోవడంతో వర్షం వచ్చే సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడి కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. లక్షల రూపాయల నిధులు ఖర్చు చేసి స్మశాన వాటికను నిర్మించిన అందులో అంత్యక్రియల నిర్వహణకు షెడ్డు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తెలియజేస్తున్నారు.

ఆదివారం తిమ్మాపురం గ్రామంలో ఆదినారాయణ అనే ఓ వ్యక్తి మరణిస్తే స్మశాన వాటికలో అతని అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించగా కాసేపటికే జోరున వర్షం ప్రారంభం అయింది. చితి మంటలు ఆరిపోయే పరిస్తితి రాగా అప్పటికప్పుడు గ్రామంలోకి వెళ్ళి పరదా తెచ్చి మృతదేహం పై వర్షం పడకుండా పట్టుకున్నారు.

చితి పూర్తిగా కాలిన వరకు వర్షంలో చితిమంటలు చుట్టూ నలుగురు వ్యక్తులు పరదా పట్టుకొని ఉండాల్సి వచ్చింది. దానిని చూసిన వారందరు మనసులు బాధ కలిగించాయి. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని అంతా అనుకున్నారు.

ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని యంత్రాంగం తక్షణమే స్మశానంలో షెడ్ నిర్మించి, సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ వర్షా కాలంలో ఎవరైనా చనిపోతే పాడి మోయటానికే కాదు....శ్మశాన వాటికలో దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు టార్బాన్ పట్టుకునేందుకు నలుగురు ఉండాలని అంటున్నారు గ్రామస్తులు.