శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడింది.. కమిషన్ కు ఆశపడి ఏకంగా రూ. 14 కోట్లు విలువ డ్రగ్స్ తీసుకు వచ్చిందో మహిళ. విదేశాల నుండి హేరాయిన్, కోకైన్ లను వివిధ మార్గాల్లో నగరానికి తీసుకొస్తున్నా ఇక్కడ రిసీవర్ లకు చేరే లోపే వారిని పట్టుకుంటున్నారు అధికారులు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, టాంజానియా లాంటి దేశాల వారు అక్కడి మాఫియా అదేశాల ను పాటిస్తూ దేశాలు దాటి సిటీ కి డ్రగ్స్ ను చేరుస్తున్నారు. అంతా బాగుంది అనుకునే లోపే విమానాశ్రయం లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో పట్టు బడుతున్నారు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా,బురుండి దేశాల నుండి ఎక్కువ మొత్తంలో డ్రక్స్ సిటీకి చేరుతున్నట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. అనుమానంగా ఉన్న ప్రతి వ్యక్తినీ పగడ్బందీగా స్కాన్ చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. బురుండి దేశానికి చెందిన ఒక మహిళ నుండి 14 కోట్లు విలువ చేసే హెరాయున్ ను స్వాధీనం చేసుకున్నారు. తాను తీసుకొస్తున్న ట్రాలీ బ్యాగ్ లో దుస్తులు, హ్యాండ్ బ్యాగ్‌లు, సబ్బులు పెట్టి వాటి మధ్యలో డ్రగ్స్ పౌడెర్ ను తీసుకొచ్చింది. ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేసి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే అధికారుల దర్యాప్తులో సిటీలో డ్రగ్స్ రిసీవర్ ఎవరు అనే అంశంపై మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు ఆ యువతి.