
తేమను నియంత్రించే పేపర్ టవల్ పద్ధతి: అల్లం పాడవడానికి ప్రధాన కారణం దానిపై పేరుకుపోయే అధిక తేమ లేదా గాలి లేకపోవడం. అల్లాన్ని కొన్న తర్వాత శుభ్రంగా కడిగి, తడి లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత దానిని ఒక పేపర్ టవల్ లేదా మెత్తని కాటన్ వస్త్రంలో చుట్టాలి. దీనిని ఒక గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వారం నుంచి పది రోజుల వరకు అల్లం ఇప్పుడే మార్కెట్ నుండి తెచ్చినట్లుగా తాజాగా ఉంటుంది.

జిప్‌లాక్ బ్యాగుల వాడకం: మీరు అల్లాన్ని నిల్వ చేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్లలో కాకుండా జిప్‌లాక్ బ్యాగులను వాడటం మంచిది. అల్లాన్ని బ్యాగులో ఉంచిన తర్వాత అందులో గాలి లేకుండా జాగ్రత్తగా నొక్కి సీల్ చేయాలి. గాలి తగలకుండా ఉండటం వల్ల అల్లం ముడతలు పడదు. దీనిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వేసవి ఉష్ణోగ్రతల నుండి రక్షణ లభిస్తుంది.

ఫ్రీజర్‌లో నిల్వ: ఒకవేళ మీ దగ్గర అల్లం ఎక్కువగా ఉండి, అది పాడైపోతుందని భయపడితే ఫ్రీజింగ్ పద్ధతి ఉత్తమం. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక బాక్సులో వేసి ఫ్రీజర్‌లో ఉంచండి. అల్లాన్ని మిక్సీ పట్టి ఐస్ ట్రేలలో వేసి క్యూబ్స్‌లా చేయండి. ఆ క్యూబ్స్ గడ్డకట్టిన తర్వాత వాటిని ఒక బ్యాగులో వేసి దాచుకోవచ్చు. వంట చేసేటప్పుడు ఒక క్యూబ్ తీసి నేరుగా వాడొచ్చు. ఇది నెలల తరబడి తాజాగా ఉంటుంది.

వెనిగర్ లేదా నిమ్మరసం పద్ధతి: అల్లం పొట్టు తీసి, ముక్కలుగా కోసి ఒక గాజు సీసాలో వేయండి. అందులో అది మునిగే వరకు వెనిగర్ లేదా నిమ్మరసం పోసి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల అల్లం అస్సలు పాడవదు సరే కదా, దాని రుచి కూడా మరింత పెరుగుతుంది. పచ్చళ్లలో వాడే వారికి ఇది చాలా ఉపయోగకరం.

ఇసుకలో నిల్వ చేయడం: ఒకవేళ మీకు ఫ్రిజ్ అందుబాటులో లేకపోతే, ఒక వెడల్పాటి పాత్రలో పొడి ఇసుకను పోసి అందులో అల్లాన్ని కప్పి ఉంచండి. ఇది అల్లానికి కావాల్సిన చల్లదనాన్ని అందిస్తూ, బయట ఉండే వేడి నుండి రక్షిస్తుంది. పాత కాలంలో మన అమ్మమ్మలు ఈ పద్ధతినే అనుసరించేవారు.