
అధిక రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్ వల్ల శరీరంలోని కీలకమైన హార్మోన్లు అసమతుల్యతకు గురవుతాయి. ముఖ్యంగా ఆల్డోస్టెరాన్, కార్టిసాల్, అడ్రినలిన్, థైరాయిడ్ వంటి హార్మోన్ల స్థాయిలో మార్పులు రావడం వల్ల పీరియడ్స్ క్రమరహితంగా మారే అవకాశం ఉంది.

రక్తనాళాలపై ప్రభావం: అధిక రక్తపోటు గర్భాశయం, అండాశయాలకు రక్తాన్ని చేరవేసే ధమనులను దెబ్బతీస్తుంది. దీనివల్ల నెలసరి సమయంలో రక్త ప్రవాహం పెరిగి అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది.

అంతేకాదు ఒకవేళ బిపి సమస్య తీవ్రమైతే గర్భాశయ ధమనులు కుంచించుకుపోయి, పీరియడ్స్ శాశ్వతంగా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో అమెనోరియా అని పిలుస్తారు. ఇది ఒక రకమైన ముందస్తు మెనోపాజ్ వంటిది.

బీపీ తక్కువగా ఉండటం కూడా ప్రమాదకరమే. తక్కువ రక్తపోటు ఉన్న మహిళల్లో నెలసరి సమయంలో.* తీవ్రమైన తలతిరగడం, నీరసం, మూర్ఛపోవడం, భారీ రక్తస్రావం కావడం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీనివల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గి రక్తహీనత ఏర్పడుతుంది. రక్తహీనత వల్ల శరీరానికి అందాల్సిన ఆక్సిజన్ స్థాయిలు తగ్గి మరింత అనారోగ్యానికి దారితీస్తుంది.

గుండె, మూత్రపిండాలు, మెదడు వంటి అవయవాలు సజావుగా పనిచేయాలన్నా.. ఋతుచక్రం సక్రమంగా ఉండాలన్నా రక్తపోటును అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి. క్రమం తప్పకుండా బీపీ చెకప్ చేయించుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.